Begin typing your search above and press return to search.

సెకండ్ ఫేజ్‌!... పోలింగ్ ప‌ర్సంటేజీలు ఇవే!

By:  Tupaki Desk   |   18 April 2019 6:17 PM GMT
సెకండ్ ఫేజ్‌!... పోలింగ్ ప‌ర్సంటేజీలు ఇవే!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా రెండో ద‌శ పోలింగ్ ముగిసిపోయింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరితో పాటు 11 రాష్ట్రాల‌కు చెందిన 95 లోక్ స‌భ స్థానాల‌కు ఈ ద‌శ‌లో పోలింగ్ జ‌రిగింది. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రానికి ముగిసింది. తొలుత మంద‌కోడిగానే ప్రారంభ‌మైన పోలింగ్... ఆ త‌ర్వాత కూడా పెద్ద‌గా ఊపందుకోలేద‌నే చెప్పాలి. ఏపీలో మాదిరిగా ఈ ద‌శ‌లో ఓట‌ర్లు పోలింగ్ బూత్ ల‌కు క్యూ క‌ట్ట‌లేద‌నే చెప్పాలి. ప‌శ్చిమ బెంగాల్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌తో పాటు కేంద్ర‌పాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో మాత్రం పోలింగ్ బాగానే న‌మోదైంది.

పోలింగ్ ముగిసే స‌మ‌యానికి రెండో ద‌శ ఎన్నిక‌లు జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రాస‌రిన 66 శాతం ఓట్లు పోలైన‌ట్లుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం అంచ‌నా వేసింది. ఈ 95 స్థానాల్లో ఏకంగా 1,600 మంది అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగ‌గా... వీరి భ‌విత‌వ్యాన్ని తేల్చేందుకు ఏకంగా 15.80 కోట్ల మంది ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు రావాల్సి ఉండ‌గా... అందులో స‌గానికి పైగా ఓట‌ర్లు మాత్ర‌మే పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చారు. ఇక రెండో ద‌శ ఎన్నిక‌లు జ‌రిగిన రాష్ట్రాల్లో ఏ మేర పోలింగ్ శాతం న‌మోదైంద‌న్న విష‌యానికి వ‌స్తే... ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 62.30 శాతం పోలింగ్ న‌మోదు కాగా.. క‌ర్ణాట‌క‌లో 61.84 శాతం పోలింగ్ న‌మోదైంది.

బీహార్ లో 62.52 శాతం, మ‌హారాష్ట్రలో 57.22 శాతం, త‌మిళ‌నాడులో 61.52, ఒడిశాలో 57.41 శాతం, ఛ‌త్తీస్ గ‌ఢ్ లో 68.70 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక రెండో ద‌శ పోలింగ్ జ‌రిగిన ప్రాంతాల్లో అత్య‌ధిక శాతం ఓట్లు పోలైన రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే... ప‌శ్చిమ బెంగాల్ లో 75.27 శాతం, మ‌ణిపూర్‌లో 74.69 శాతం, అసోంలో 73.32 శాతం పోలింగ్ న‌మోదు కాగా... సింగిల్ సీటే ఉన్న పుదుచ్ఛేరిలో మాత్రం 72.40 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక ఈ ద‌శ‌లో పోలింగ్ జ‌రిగిన జ‌మ్మూ కాశ్మీర్ లో అత్య‌ల్పంగా 43.37 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదైంది.