Begin typing your search above and press return to search.

భారత్‌లో సీ ప్లేన్ల తయారీ

By:  Tupaki Desk   |   12 Dec 2017 2:30 PM GMT
భారత్‌లో సీ ప్లేన్ల తయారీ
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీ ప్లేన్‌లో ప్ర‌యాణించిన సంగ‌తి తెలిసిందే. భార‌త ర‌వాణ రంగం మ‌రో మ‌లుపు తిర‌గ‌నుంది. నీటిలో దిగే, ఎగిరే విమానాలను (సీ ప్లేన్‌లను) భారత్‌లో తయారు చేయాలని జపాన్‌కు చెందిన సంస్థ సిటౌచీని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. సిటౌచీ తయారు చేసిన సీ ప్లేన్‌ను శనివారం ముంబయి తీరంలో విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో మంత్రి ఈ విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాలకు, ఇప్పటికీ విమానయాన సౌకర్యం లేని చిన్న పట్టణాలకు వైమానిక సౌకర్యాన్ని కల్పించే దిశగా మంత్రి ఈ విజ్ఞప్తి చేశారు. భారత్‌లో సీ ప్లేన్‌లను తయారు చేయడానికి మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని మంత్రి ఆ సంస్థకు హామీ ఇచ్చారు. నాగ్‌పూర్‌లో స్థలం సిద్ధంగా ఉందని, అక్కడ మీ సీ ప్లేన్‌లను తయారు చేయండి అని ఆ సంస్థకు సూచించారు.

సిటౌచీ తయారు చేసిన పది సీట్లతో కూడిన కోడియాక్ క్వెస్ట్ 1000 సీ ప్లేన్‌ను స్పైస్‌జెట్ శనివారం రెండోసారి ముంబయి సమీపంలోని గిర్‌గౌమ్ చౌపతి తీరంలో ప్రయోగాత్మకంగా నడిపింది. భారత్‌లో సీ ప్లేన్‌లకు చాలా డిమాండ్ ఉందని, అయితే వీటిని దేశీయంగా తయారు చేయడం వల్ల వ్యయం తగ్గుతుందని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి సీ ప్లేన్‌ల తయారీకి మార్గదర్శకాలను మూడు నెలల్లోగా తయారు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దీనిని సీ ప్లేన్ అని పిలిచారని, తాను మాత్రం దీనిని ఫ్లైయింగ్ బోట్ అని పిలుస్తానని గడ్కరీ అన్నారు. సీ ప్లేన్ అని పిలిస్తే, అది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి వెళ్తుందని, ఫ్లైయింగ్ బోట్ అని పిలిస్తే అది తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని గడ్కరీ వ్యాఖ్యానించారు. అజయ్ సింగ్ ప్రమోటర్‌గా ఉన్న ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ రూ. 400 డాలర్ల వ్యయంతో వందకు పైగా ఉభయచర విమానాలను (సీ ప్లేన్‌లను) కొనుగోలు చేయడానికి కసరత్తు చేస్తోంది. వీటి ద్వారా ప్రాంతీయంగా వైమానిక సేవలను ముమ్మరం చేయాలని స్పైస్‌జెట్ భావిస్తోంది.

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. తొలిసారి సీ ప్లేన్‌లో ప్రయాణం చేశారు. సబర్మతి నది నుంచి సీ ప్లేన్‌ ద్వారా ధారోయ్‌ డ్యామ్‌ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అంబాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మోడీ గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదన్న కాంగ్రెస్‌ విమర్శలకు ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ఆ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి ఉండదని కౌంటర్ ఇచ్చారు. దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులో నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్‌ వేస్‌ పై దృష్టిపెట్టామని ట్వీట్‌ చేశారు.