Begin typing your search above and press return to search.

అంత‌ర్జాతీయ 20 క్రికెట్లో రికార్డ్‌: దుమ్ము రేపే సెంచ‌రీ

By:  Tupaki Desk   |   17 Sep 2019 5:49 AM GMT
అంత‌ర్జాతీయ 20 క్రికెట్లో రికార్డ్‌: దుమ్ము రేపే సెంచ‌రీ
X
ప‌సికూనలు కూడా పొట్టి క్రికెట్ లో దుమ్ము రేపుతున్నాయి. అంత‌ర్జాతీయ క్రికెట్లో పెద్ద దేశాల‌కు - టెస్ట్ హోదా ఉన్న దేశాల‌కు సాధ్యంకాని రికార్డులు త‌మ ఖాతాలో వేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అప్గ‌న్ ఆట‌గాళ్లు జింబాబ్వేపై ఏడు వ‌రుస బంతుల్లో ఏడు సిక్సులు కొట్టి అరుదైన రికార్డు సాధించారు. ఆ రికార్డు క్రియేట్ అయిన మ‌రుస‌టి రోజే పొట్టి క్రికెట్లో ఒకే మ్యాచ్‌ లో ప‌లు రికార్డులు న‌మోద‌య్యాయి. నెద‌ర్లాండ్స్‌ తో జ‌రుగుతోన్న ట్ర‌యాంగిల్ 20 - 20 సీరిస్‌లో స్కాట్లాండ్‌ ఓపెనర్‌ హెన్రీ జార్జ్‌ మున్సే రికార్డులతో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో మున్సే 41 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అంతర్జాతీయ 20 - 20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌ లో మున్సే 56 బంతుల్లో 127 పరుగులు చేసి చివ‌రి వ‌ర‌కు నాటౌట్‌ గా నిలిచాడు. మున్సే ఇన్నింగ్స్‌ లో ఏకంగా 14 సిక్స‌ర్లు ఉన్నాయి. 5 ఫోర్లు కొట్టాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో అరుదైన ఫీట్ కూడా సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో మున్సే రెండో స్థానంలో నిలిచాడు.

మున్సేతో పాటు కెప్టెన్ కోయిట్జ‌ర్ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు - 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌ కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. మైదానంలో నెద‌ర్లాండ్ బౌల‌ర్లు బాల్ వేయ‌డ‌మే ఆల‌స్యం... బంతిని ఎడాపెడా బాది వ‌దిలిపెట్టారు. వీరిద్దరి ధాటికి స్కాట్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌ లో మున్సే రికార్డులు ప‌రిశీలిస్తే 41 బంతుల్లో సెంచ‌రీ చేసి వేగ‌వంతమైన సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా) - రోహిత్‌ శర్మ (భారత్‌) - సుదేశ్‌ విక్రమశేఖర (చెక్‌ రిపబ్లిక్‌) 35 బంతుల్లోనే సెంచరీ సాధించారు. ఇక గ‌తంలో గతంలో హజ్రతుల్లా జజాయ్‌ (అఫ్గానిస్తాన్‌) 16 సిక్సర్లు కొట్టగా... ఇప్పుడు మున్సే 14 సిక‌ర్లు కొట్టాడు. ఆరోన్ ఫించ్‌ కూడా 14 సిక్సర్లు బాదాడు. ఇక మ్యాక్స్ ఒ డౌడ్ వేసిన ఓవ‌ర్లో మున్సే 32 ప‌రుగులు చేశాడు. యువరాజ్‌ సింగ్‌ (36) తర్వాత ఒక ఓవర్లో బ్యాట్స్‌ మన్‌ సాధించిన అత్యధిక పరుగులు ఇవే.