Begin typing your search above and press return to search.

బీజేపీ ప‌రువు తీసిన స్కూటీ!

By:  Tupaki Desk   |   17 July 2019 2:07 PM GMT
బీజేపీ ప‌రువు తీసిన స్కూటీ!
X
గత వారం పది రోజులుగా సోషల్ మీడియాలో ఒక్కటే వార్త జోరుగా హల్ చల్ చేస్తోంది. 10వ తరగతి పాసైన బాలికలకు మోడీ స్కూటీ యోజన అనే పథకం వర్తిస్తుందని... ఈ పథకంలో ఉన్నవారందరికీ ఫ్రీగా స్కూటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... మరో అడుగు ముందుకు వేసి అర్హులైన బాలికలకు ఫ్రీగా స్కూటీలు ఇవ్వాలనే లక్ష్యంతో స్కూటీ యోజన ప్రవేశపెట్టారు. పదో తరగతి చదివిన బాలికలు ఉన్నత విద్య అభ్యసించడానికి... చిన్నపాటి ఉద్యోగాలు చేసేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ స్కూటీ యోజన పథకం ప్రవేశపెట్టారు. ఇందుకోసం నేరుగా కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.. ఇది ఈ ప‌థ‌కంపై జ‌రుగుతోన్న ప్ర‌చారం.

సోషల్ మీడియాలో ఫేస్‌ బుక్... వాట్సప్ గ్రూపులో ఈ పోస్టు బాగా వైరల్ అవుతుండడంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఈ పథకం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటామంటూ ఆన్‌లైన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఆలు లేదు... చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా కొందరు ఆన్‌ లైన్‌ సెంటర్ల నిర్వాహకులు డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్స్ క్రియేట్ చేసి వీరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఇలాంటి పథకం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. గతంలో తమిళనాడు సీఎం పళని స్వామి 50 శాతం సబ్సిడీతో ఓ పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ ఆలోచన కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితది. ఆమె మరణానంతరం ఆమె గౌరవార్థం అక్కడి ప్రభుత్వం ఆమె 70 వ జయంతి సందర్భంగా ఈ పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం పేరు అమ్మ స్కూటీ స్కీమ్.

ఇక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఈ ప‌థ‌కం గురించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న పోస్టుల నేప‌థ్యంలో ఎవ‌రికి వారు సొంతంగా అప్లై చేసుకుని... తాము మోస‌పోయామ‌ని వాపోతున్నారు. ఎవ‌రికి వారు వారం ప‌ది రోజులుగా తమ కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ- సేవల చుట్టూ తిరుగుతున్నారు. కొంద‌రు అప్లై చేసుకున్నాక ఇలాంటి ప‌థ‌కం కేంద్రం ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని తెలుసుకుని బీజేపీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చివ‌ర‌కు ఈ ప్ర‌చారం జోరుగా జ‌రుగుతూ బీజేపీపై విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతుండ‌డంతో... ఆ పార్టీ నేత‌లు రంగంలోకి దిగి ఇదంతా అస‌త్య ప్ర‌చారం అని న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఏదేమైనా ఒక్క ఫేక్ పోస్టు ఇప్పుడు బీజేపీ నాయ‌కుల‌ను ఎంత‌గా టెన్ష‌న్ పెట్టిందో చూడొచ్చు.