Begin typing your search above and press return to search.

బెజవాడలో స్కూలు బస్సు బీభత్సం

By:  Tupaki Desk   |   23 Feb 2019 7:07 AM GMT
బెజవాడలో స్కూలు బస్సు బీభత్సం
X
విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. దీంతో వాహనదారులతోపాటు స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విజయవాడలోని మారుతినగర్ బ్రాంచికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు(ఏపీ16టీజే 6505) శుక్రవారం ఉదయం 8గంటలకు విద్యార్థులకు తీసుకొచ్చేందుకు బయలుదేరింది. మారుతినగర్ నుంచి రాజీవ్ నగర్ - సింగ్ నగర్ - ఆంధ్రప్రభ కాలనీ - సీతన్నపేటకు చెందిన విద్యార్థులను డ్రైవర్ పి.దుర్గరావు బస్సులో ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు.

ఈక్రమంలోనే బస్సు బీఆర్టీఎస్ రోడ్డులో ఉన్న శారద కళాశాల సెంటర్ కు చేరుతున్న సమయంలో డ్రైవర్ బస్సు నిలుపుకుండా వేగంగా ముందుకెళ్లాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అంతేవేగంగా రోడ్డు పైనున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. అలాగే ఎదురుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని - పండ్లు విక్రయించే రిక్షను, ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలన్నీ దెబ్బతినగా కృష్ణలంకకు చెందిన పండ్ల వ్యాపారి షేక్ మస్తాన్ వలీ తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో నజీర్ అహ్మద్ కు చెందిన ఆటో, పండ్లు విక్రయించే రిక్ష పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే ద్విచక్ర వాహనదారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు.

ఈ సంఘటన ఉదయం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఉదయం ఎక్కువ జనాభా లేకపోవడంతో కొంతమేర ప్రమాద తీవ్రత తగ్గింది. ఉదయం ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సత్యనారాయణపురం పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపైనే వదిలిన స్కూల్ బస్సును క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్ తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బస్సు ప్రమాదానికి కారణం బ్రేకులు ఫెయిల్ అవ్వడమేని పోలీసులు తేల్చారు.