ఈశాన్యానికి వరంతో ఆంధ్రోళ్లకు కారం రాశారు

Fri Mar 23 2018 10:45:23 GMT+0530 (IST)

ఎండ మండుతున్న వేళ.. కారంపొడి వంటికి తగిలితే ఎలా ఉంటుంది?  ప్రధాని మోడీ తీసుకున్న తాజా నిర్ణయం ఆంధ్రోళ్లకు అచ్చం అలానే ఉందని చెప్పాలి. తమ న్యాయమైన హోదా సాధన కోసం గడిచిన కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కిమ్మనని మోడీ సర్కారు.. ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రాలకు వరాలు ప్రకటించింది. వెనుకబడిన రాష్ట్రాలుగా ఈశాన్యానానికి చేయూత అందించే విషయంలో ఆంధ్రోళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. తమకు  మాత్రం మొండిచేయి చూపించటంపైనే వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా కేంద్ర మంత్రివర్గం బుధవారం రాత్రి పొద్దుపోయే వరకూ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహాకాలను కేంద్రం 2020 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.3300 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం 2017 పేరుతో దీన్ని అమలు చేయనున్నారు.

ఓపక్క ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు ఆందోళన మీద ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టటం ద్వారా హోదా సాధన విషయంలో ఏపీ అధికార.. ప్రతిపక్ష పార్టీలు తమ కమిట్ మెంట్ ను చెప్పకనే చెప్పేస్తున్నాయి.

అయినప్పటికీ.. ఈ విషయంపై మోడీ సానుకూలంగా స్పందించే సూచనలేమీ కనిపించట్లేదు. ఓపక్క ఆందోళనలు జరుగుతున్నా రియాక్ట్ కానీ మోడీ సర్కారు.. సరిగ్గా ఇదే తరహా అంశంపై ఈశాన్య రాష్ట్రాలకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయం ఆంధ్రోళ్లకు మరింత మంట పుట్టేలా చేయటం ఖాయం.

ఎందుకంటే ఏపీ రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ఇదే తరహా ప్రోత్సాహాల్ని ఇస్తానని ప్రకటించారు. నాడు ఆయన సభలో అన్న మాటేమిటంటే.. దేశంలోని కొన్ని రాష్ట్రాలకు ఇస్తున్న తరహాలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఏపీకి ఇస్తామని 2014 ఫిబ్రవరి 20న విభజన బిల్లు ఆమోద సమయంలో ప్రకటించటం మర్చిపోకూడదు.  ఇక.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయన్నది చూస్తే..

+ ఒక్కో యూనిట్ కు అందించే ప్రోత్సాహకాల గరిష్ఠ పరిమితి రూ.200 కోట్లు

+ కర్మాగారం.. యంత్రాలపై 30 శాతం పెట్టుబడి ప్రోత్సాహం

+ భవనం.. కర్మాగారం.. యంత్రాలపై చెల్లించిన బీమా ప్రీమియాన్ని.. కేంద్ర ప్రభుత్వ వాటా కిందకు వచ్చే సీజీఎస్టీ.. ఐజీఎస్టీని ఆదాయ పన్నులో కేంద్ర వాటాను మొదటి ఐదేళ్లలో తిరిగి చెల్లించటం

+ రవాణా రుసుములో 20 శాతం రాయితీ

+ అంతర్గత జలమార్గం ద్వారా చేసే రవాణాపై 20 శాతం రాయితీ

+ త్వరగా చెడిపోయే వస్తువులను దగ్గర్లోని ఎయిర్ పోర్టుల నుంచి దేశంలో ఏ విమానాశ్రాయానికైనా రవాణా చేయటానికి అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ

+ ఉద్యోగులకు చెల్లించే పీఎఫ్ మొత్తంలో యజమాని తరఫున 3.67 శాతం ప్రభుత్వమే చెల్లించటం