Begin typing your search above and press return to search.

ఘరానా దొంగలు.. ఇంటి దొంగలు

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:30 PM GMT
ఘరానా దొంగలు.. ఇంటి దొంగలు
X
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నీ ఈ స్థాయిలో కాకపోయినా గత అయిదేళ్లలో భారీ మోసాలు చాలానే జరిగాయి. బ్యాంకులకు టోకరా ఇచ్చిన ఘటనలు భారీగా ఉన్నాయని - అలాగే ఇలాంటి మోసాల్లో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందని తేలడంతో వందలాది మంది బ్యాంకు అధికారులను సస్సెండ్ చేశారని నివేదికలు చెప్తున్నాయి.

దేశంలో 2012-16 మధ్య బ్యాంకులు రూ.22,743 కోట్లు మోసపోయినట్లు బెంగుళూరులోని ఐఐఎం నివేదిక వెల్లడించింది. మరోవైపు 2017 డిసెబరు 21 వరకు బ్యాంకులను మోసగించిన కేసులు 25,600 నమోదయ్యాయని.. 179 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు ఆర్బీఐ నివేదికను ఉటంకిస్తూ సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంటుకు వెల్లడించింది.

ఆర్బీఐ వెల్లడించిన మరో నివేదిక ఎప్పుడెప్పుడు ఏఏ బ్యాంకుల్లో ఎన్నెన్ని మోసాలు గుర్తించారు.. ఎంతమంది అధికారులు దొరికిపోయారన్న వివరాలు ఆర్బీఐ గత మార్చిలో వెల్లడించింది. దాని ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఐసీఐసీఐ బ్యాంకులో 455 - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 429 - స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌ లో 244 - హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్‌ లో 237 మోసాల కేసులు బయటపడ్డాయి. అవన్నీ రూ.లక్ష అంతకంటే ఎక్కువ మొత్తానికి జరిగిన మోసాలు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 64 మంది - హెచ్‌ డీఎఫ్‌ సీలో 49 - యాక్సిస్ లో 35 మంది అధికారులకు ఇలాంటి మోసాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ కూడా రూ.11,400కోట్ల రూపాయల కుంభకోణం కేసులో 20మంది బ్యాంకు సిబ్బందిని సస్పెండ్ చేసింది.

ఏటా మోసాలిలా...

2011: బ్యాంక్ ఆఫ్ మహారాష్ర్ట - సెంట్రల్ బ్యాంక్ - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ - ఐడీబీఐలో ఆయా బ్యాంకులకు చెందినవారే కొందరు 10 వేల ఖాతాలను ప్రారంభించి రూ.150 కోట్లు రుణాల రూపంలో వాటికి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది.

2014: 2014లో కొందరు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అధికారులపై ముంబై పోలీసులు మొత్తం 9 ఎఫ్‌ ఐఆర్‌ లు నమోదు చేశారు. వాళ్లంతా రూ.700కోట్ల రూపాయల మేర ఫిక్స్‌ డ్ డిపాజిట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. కోల్‌ కతాకు చెందిన పారిశ్రామిక వేత్త బిపిన్ బోరా నకిలీ డాక్యుమెంట్ల సాయంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1400కోట్ల మేర రుణం పొందినట్లు ఆరోపణలున్నాయి. సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ కే జైన్ లంచం తీసుకొని రూ.8వేల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన నేరం బయటపడింది. విజయ్ మాల్యాను ‘విల్‌ ఫుల్ డిఫాల్టర్‌’గా యూనియన్ బ్యాంక్ 2014లోనే ప్రకటించింది. ఆ తరవాత ఎస్‌ బీఐ - పీఎన్‌ బీలు కూడా యూనియన్ బ్యాంక్ దారిలోనే నడిచాయి.

2015:విదేశీ ద్రవ్య మారకం కుంభకోణంలో అనేక బ్యాంకుల ఉద్యోగులతో పాటు హాంగ్‌ కాంగ్‌ కు చెందిన ఓ కంపెనీ పాత్ర ఉన్నట్లుతేలింది. వీళ్లంతా కలిసి దాదాపు రూ.6వేల కోట్ల రూపాయల మేర మోసగించారు.

2016:నలుగురు వ్యక్తులు 386 ఖాతాలు తెరిచి సిండికేట్ బ్యాంక్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ఈ కుంభకోణంలోనూ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ద్వారానే మోసం చేశారు.

2017: విజయ్ మాల్యా బ్యాంకులకు ఎగ్గొట్టిన రూ.9500 కోట్ల రూపాయల కేసు విషయంలో సీబీఐ 2017లో చార్జ్ షీట్ దాఖలు చేసింది. 2016లో మాల్యా లండన్ పారిపోయాడు. కొన్ని నెలల క్రితం ‘విన్సల్ డైమెండ్స్‌’కు సంబంధించిన రూ.7వేల కోట్ల రూపాయల కుంభకోణం బట్టబయలైంది .కోల్‌ కతాకు చెందిన వ్యాపారి నీలేష్ పరేఖ్‌ ను 2017లో అరెస్టు చేశారు. అతడు కనీసం 20 బ్యాంకులను రూ.2223 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలున్నాయి.

నాలుగు గంటలకో అధికారిపై వేటు..

బ్యాంకు మోసాల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడించింది. ప్రతి నాలుగు గంటలకోసారి అవినీతి - అక్రమాలకు పాల్పడ్డ బ్యాంక్ అధికారులపై వేటు పడుతోంది. 2015 జనవరి నుంచి 2017 మార్చి వరకూ అవినీతి - దగా - అక్రమాలకు సంబంధించి 5200 మంది ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులపై చర్యలు తీసుకున్నారు. వీరు దోషులుగా నిర్థారణ కావడంతో చేసిన అక్రమాలకు పెనాల్టీలూ విధించి సర్వీసు నుంచీ తొలగించినట్టు ఆర్‌ బిఐ నివేదిక చెబుతోంది.

ఇలాంటి అక్రమ బ్యాంకర్లలో ఎస్‌ బిఐకి చెందిన అధికారులే అత్యధిక సంఖ్యలో 1538మంది ఉన్నారు. ఈ విషయంలో ఐఓసీ రెండోస్థానంలో - సెంట్రల్ బ్యాంక్ మూడో స్థానంలో ఉన్నాయి. పరిశీలనలో ఉన్న ఈ రెండేళ్ల కాలంలోనే 184మంది పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు అవినీతికి పాల్పడి దొరికిపోయనట్టు ఆర్‌ బిఐ నివేదిక చెప్తోంది.