Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్ర‌శ్న‌ను సంధించారు?

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:10 AM GMT
కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్ర‌శ్న‌ను సంధించారు?
X
కొన్ని ప‌నులు అస్స‌లు మొద‌లుకావు. ఎన్ని అనుకున్నా.. ఏదో ఒక అడ్డంకి ఎదుర‌వుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి త‌న న‌మ్మ‌కాల‌కు త‌గ‌ని రీతిలో ఉన్న అసెంబ్లీ.. స‌చివాల‌యాన్ని త‌న న‌మ్మ‌కాల‌కు.. అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు నిర్మించుకోవాలని తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత‌లా త‌పిస్తున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఇప్ప‌టికే ఈ రెండు నిర్మాణాల కోసం విప‌రీతంగా శ్ర‌మించిన ఆయ‌న‌.. ఎట్ట‌కేల‌కు స‌చివాల‌యాన్ని ఇప్పుడున్న చోటే నిర్మించేలా డిసైడ్ కాగా.. అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఖైర‌తాబాద్ కు కూత‌వేటు దూరంలో ఉన్న ఇర్రుం మంజిల్ (ఎర్ర మంజిల్) లో నిర్మించాల‌ని నిర్ణ‌యించారు.

ఇందులో భాగంగా చారిత్ర‌క క‌ట్ట‌డ‌మైన ఇర్రుం మంజిల్ భ‌వ‌నాన్ని కూల్చేయాల‌ని నిర్ణ‌యించ‌టంపై ఆ భ‌వ‌నాన్ని నిర్మించిన కుటుంబాల వారు తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.ఈ భ‌వ‌నాన్నికూల్చివేత నిర్ణ‌యాన్ని న‌వాబ్ స‌ఫ్ద‌ర్ ముషీరుద్దౌలా ఫ‌క్రుల్ ముల్క్ వార‌సులు వ్య‌తిరేకిస్తున్నారు. వివిధ దేశాల్లో స్థిర‌ప‌డ్డ న‌వాబ్ జంగ్ మ‌న‌వ‌ళ్లు తాజాగా హైద‌రాబాద్ కు వ‌చ్చి మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఇర్రుం మంజిల్ ప‌రిర‌క్ష‌ణ‌పై న‌డుం బిగించారు. ఈ సంద‌ర్భంగా వారు తెర మీద‌కు తెచ్చిన వాద‌న ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారింది. రాష్ట్రం విడిపోయి.. ఎమ్మెల్యేల సంఖ్య 294 నుంచి 119 మందికి త‌గ్గిపోయిన త‌ర్వాత విశాలంగా ఉన్న అసెంబ్లీ భ‌వ‌నాన్ని వ‌దిలేసి.. చారిత్ర‌క క‌ట్ట‌డాన్ని కూల్చివేసి కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించాల్సిన అవ‌స‌రం ఏమిటి? అని ప్ర‌శ్నించారు.

ఫ్యూచ‌ర్ లో చార్మినార్.. మ‌క్కా మ‌సీదును కూడా ఏదో ఒక కార‌ణం చెప్పి కూల్చేస్తారా? ఇలా అయితే ఘ‌న చ‌రిత్ర క‌లిగిన హైద‌రాబాద్ లో మిగిలేదేమిటి? ఈ భ‌వ‌నాన్ని ప‌రిర‌క్షిస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌టంతోనే స‌ఫ్ద‌ర్ జంగ్ మ‌ర‌ణించిన త‌ర్వాత ఈ భ‌వ‌నాన్ని ప్ర‌భుత్వానికి అప్ప‌గించామ‌ని.. ఫ్యూచ‌ర్ లో దాన్ని కూల్చేస్తార‌న్న అనుమానం వ‌చ్చి ఉంటే తాము అస్స‌లు అప్ప‌గించే వాళ్లం కాద‌ని చెప్పారు. హైద‌రాబాద్ ఘ‌న చ‌రిత్ర‌ను భవిష్య‌త్తు త‌రాల‌కు అందించేందుకు వీలుగా ఈ భ‌వ‌నాన్ని మ్యూజియంగా మార్చాల‌ని వారు కోరారు. ఊహించ‌ని రీతిలో ఎంట్రీ ఇచ్చిన న‌వాబు ఫ్యామిలీ వాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.