Begin typing your search above and press return to search.

ఆర్థిక ఇబ్బందులతో లాడెన్ కంపెనీలో రచ్చ రచ్చ

By:  Tupaki Desk   |   4 May 2016 6:32 AM GMT
ఆర్థిక ఇబ్బందులతో లాడెన్ కంపెనీలో రచ్చ రచ్చ
X
ఓడులు బండ్లు కావటం.. బండ్లు ఓడలు కావటం అంతా కాలంతో ముడిపడి ఉంటుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగే కంపెనీలు.. కాలక్రమంలో మసకబారటం మామూలే. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ గా వ్యవహరించి.. ప్రపంచ పెద్దన్న అమెరికాకు వణుకు పుట్టించిన బిన్ లాడెన్ ను చాలామంది అంతర్జాతీయ ఉగ్రవాదిగానే చూస్తారు. కానీ.. ఆయనలో చాలామందికి తెలియని ఇంకోకోణం .. ఆయన అపర కుబేరుడు. అతి పెద్ద నిర్మాణ కంపెనీ యజమాని కూడా. లాడెన్ కుటుంబం సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా కేంద్రంగా ‘‘సౌదీ బిన్ లాడెన్ గ్రూప్’’ (ఎస్టీజీ) కార్యకలపాలు సాగిస్తుంటుంది.

లాడెన్ మరణం తర్వాత ఈ సంస్థకు ఏదో ఒక కష్టాలు నెత్తిన పడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మక్కాలోని నిర్మాణ పనుల్లో భాగంగా క్రేన్ కూలటం.. పెద్ద ఎత్తున హజ్ యాత్రికులు మరణించటం తెలిసిందే. ఈ ఘటనతో లాడెన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థకు సౌదీ అరేబియా కాంట్రాక్టులు ఇచ్చేయటం ఆపేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు చమురు ధరలు భారీగా పతనం కావటంతో సౌదీ అరేబియా సహా చమురు ఎగుమతుల మీద ఆధారపడి బతుకుతున్న దేశాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. ఈ ప్రభావం లాడెన్ కంపెనీ మీద పడింది. సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి కంపెనీకి రావాల్సిన చెల్లింపులు నిలిపివేయటంతో.. కంపెనీ సిబ్బందికి వేతనాలు ఇవ్వటం లేదు. దీంతో.. కంపెనీకి చెందిన 77వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు దాదాపు 660 మిలియన్ డాలర్ల మేరకు చేరుకున్నట్లు చెబుతున్నారు.

తమకు జీతాలు ఇవ్వని లాడెన్ కంపెనీ మీద ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం చెందటమేకాదు.. కంపెనీకి చెందిన ఏడు బస్సుల్ని తగలబెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించిన లాడెన్ కంపెనీ.. దాదాపు 38 వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం ఉద్యోగుల్లో మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఒకదాని మీద ఒకటి అన్నట్లుగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో ఒకప్పుడు వెలిగిపోయిన లాడెన్ కంపెనీ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కిందామీదా పడుతున్న దుస్థితిలో చిక్కుకుంది.