Begin typing your search above and press return to search.

మోడీకి ఓ రేంజ్‌ లో ఇంటిపోరు పెడుతున్న ఎంపీ

By:  Tupaki Desk   |   17 Jun 2018 4:32 AM GMT
మోడీకి ఓ రేంజ్‌ లో ఇంటిపోరు పెడుతున్న ఎంపీ
X
ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా - సమ్మెకు దిగిన ఐఏఎస్‌ లు తిరిగి విధుల్లోకి చేరడం తదితర డిమాండ్లతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ - తన మంత్రులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్ష శ‌నివారంతో ఆరో రోజుకు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. కేజ్రీవాల్‌ ధర్నాకు జాతీయ నాయకులు నుంచి మద్దతు అభిస్తోంది. స‌హ‌జంగా ఇది విప‌క్ష నేత‌ల నుంచే అనే సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, తాజాగా ప్ర‌ధాని మోడీకి మంట‌పుట్టేలా....బీజేపీ శ్రేణులు అవాక్క‌య్యేలా ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ట్వీట్‌ చేశారు.

కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తుగా చేసిన ఆ ట్వీట్లో కేజ్రీవాల్‌ ను జంటిల్‌ మాన్‌ గా సిన్హా అభివర్ణించాడు. ప్రస్తుత రాజకీయ పార్టీలకు ఆప్‌ తండ్రిలాంటి పార్టీ అని పొగడ్తల్లో ముంచెత్తారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ చాలా బలమైనది - బీజేపీకి ఇది అతి పెద్ద సవాల్‌ అని ట్వీట్‌ చేశారు. కేజ్రీవాల్‌ పరిపాలన - ప్రభుత్వ పథకాలపై ప్రశంశలు కురిపిస్తూ.. ప్ర‌జ‌ల ఆకాంక్ష కోసం ఉద్య‌మిస్తున్న సీఎం కోరిక నెర‌వేరాల‌న్నారు.

కాగా, తమను ఎల్జీ కార్యాలయంనుంచి బలవంతంగా తరలించాలని చూస్తే మంచినీళ్లు తాగడం కూడా మానేస్తామని ఉప ముఖ్య‌మంత్రి మనీశ్ సిసోడియా హెచ్చరించారు. ఐఏఎస్‌ లు సమ్మెకు ముగింపు పలికేలా ప్రధాని మోడీ చొరవ చూపాలని కేజ్రీవాల్ శుక్రవారం రాసిన మరో లేఖలో విన్నవించారు. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తనకు ఆహ్వానం అందిందని, ఈ సందర్భంగా ప్రధానిని కలిసి తమ డిమాండ్లను విన్నవిస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒకవేళ ప్రధాని నుంచి ఆశించిన స్పందన రాకపోతే ఢిల్లీలోని 10 లక్షల కుటుంబాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదిలాఉండ‌గా...దీక్షపై ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా విమర్శలు చేశారు. ఇన్ని రోజులుగా ఆహారం, నీరు తీసుకోకుండా ఉన్నప్పటికీ.. మంత్రి సత్యేంధ్రజైన్ కిలోన్నర బరువు ఎలా పెరిగారని ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో వారు ఏ నీరు తాగుతున్నారో.. అది ప్రజలకు కూడా సప్లై చేయాలన్నారు. తన బరువు పెరిగిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని సత్యేంధ్రజైన్ అన్నారు. నాలుగు రోజుల్లో మూడున్నర కిలోలకు పైగా బరువు తగ్గానని ట్వీట్ చేశారు. రక్తంలో షుగర్ లెవర్స్ పడిపోయాయని.. తన హాస్పిటల్ రిపోర్ట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాలుగు నెలులుగా సమ్మె చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం తప్పుపట్టింది. అధికారులంతా విధులకు హాజరవుతున్నారని.. లంచ్ టైంలో మాత్రం ఐదు నిమిషాలు మౌన ప్రదర్శన చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.

మరోవైపు.. కేజ్రీవాల్ ను కలిసేందుకు వెళ్లాలని మమతాబెనర్జీ - చంద్రబాబు - కుమారస్వామి - పిన్నరయి విజయన్ అనుకున్నా.. రాజ్ భవన్ అధికారులు పర్మీషన్ ఇవ్వలేదు. దీంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకొని వారు కుటుంభసభ్యులను పరామర్శించారు. అయితే గౌరవనీయ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతహాగా ఇంతపెద్ద నిర్ణయం తీసుకొని ఉండరని, PMO డైరెక్ట్ చేయడంతోనే తనని కలిసేందుకు మమతా - బాబు - పిన్నరయి - కుమారస్వామిలకు పర్మీషన్ ఇవ్వలేదని కేజ్రీవాల్ ఆరోపించారు.