వారికిదే చివరి నవ్వు: శత్రుఘ్న సిన్హా

Tue Feb 13 2018 19:40:07 GMT+0530 (IST)

ఒక పార్టీలో ఉంటూ....అదే పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం.....అయినప్పటికీ వారిపై పార్టీ ఏరకమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం...వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే బీజీపీలో ఇటువంటి అరుదైన వ్యక్తులు ఇద్దరుండడం విశేషం. వారిలో ఒకరు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి కాగా....మరొకరు షార్ట్ గన్ శత్రుఘ్న సిన్హా! తాను చెప్పదలుచుకున్న విషయాలను నిర్మొహమాటంగా వెల్లడించడంలో  సుబ్రమణ్య స్వామి తరహాలోనే శత్రుఘ్న సిన్హాకు తిరుగులేదు. స్వపక్షమైనా - విపక్షమైనా....కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయనకు అలవాటు. నోట్ల రద్దు సమయంలో మోదీని శత్రుఘ్న సిన్హా బహిరంగంగానే విమర్శించారు. కొద్ది రోజుల క్రితం....పార్టీలో దురహంకారం పెరుగుతోందని - వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే 'వన్ మేన్ షో - టు మేన్ ఆర్మీ` పద్ధతులకు స్వస్తి చెప్పాలని....మోదీ - అమిత్ షాలనుద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ షార్ట్ గన్ మరోసారి బీజేపీ పై మండిపడ్డారు.సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ......బీజేపీకి కొరకరాని కొయ్యలా మారిన శత్రుఘ్నసిన్హా గతంలో కూడా రాహుల్ గాంధీ - ప్రతిపక్ష నాయకులను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. తాజాగా మరోమారు మోదీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నవ్వినందుకు ఆమెను శూర్పణఘతో పోల్చడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై బీజేపీ `రెబల్` శత్రుఘ్నసిన్హా ట్విటర్ లో స్పందించారు. రేణుక ఎల్లపుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఎవరేమన్నా పట్టించుకోవద్దని తనను చూసి ఏడ్చేవారిని ఏడవనివ్వాలని ట్వీట్ చేశారు. మహిళా సాధికారతను వ్యతిరేకించేవాళ్లు త్వరలోనే పతనమవుతారని వారికి ఇదే చివరి నవ్వు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి తాజాగా ఈ షార్ట్ గన్ చేసిన షార్ప్ కామెంట్స్ పై బీజేపీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.