Begin typing your search above and press return to search.

వెంకయ్య లేడు; చూసి హామీలివ్వండి!

By:  Tupaki Desk   |   23 July 2017 5:10 PM GMT
వెంకయ్య లేడు; చూసి హామీలివ్వండి!
X
మామూలుగానే రాజకీయ నాయకులు అయిన వారికి ప్రజలకు హామీలిచ్చే సమయంలో ఒళ్లు తెలియదు. పైగా అది ఎన్నికల వేళ అయితే గనుక.. ఇక వాళ్ల మాటలు ఎన్ని కోటలు దాటుతాయో చెప్పనలవి కాదు. ఇప్పుడు నంద్యాలలోనూ అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎడాపెడా ఎన్నెన్ని వారలు ఇచ్చేస్తున్నాడో అందరికీ తెలుసు. అయితే ఈ ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు ఎన్నిక కోసం మోహరించిన మంత్రులంతా తమకు తోచిన రీతిలో గుర్తొచ్చిన హమీలన్నీ గుప్పించేస్తున్నారు. కొందరు మంత్రులు నంద్యాలను కూడా విశాఖపట్టణం, తిరుపతి లాగా స్మార్ట్ సిటీ చేసేస్తాం అంటున్నారు. అయితే ప్రత్యేకించి ఈ ‘స్మార్ట్ సిటీ’ హామీలమీద తెదేపా నేతల్లోనే సెటైర్లు వినిపస్తున్నాయి. ‘‘కేంద్రంలో ఇప్పుడు వెంకయ్యనాయుడు లేడు.. కాస్త చూసుకుని హామీలివ్వండి’’.. అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.

వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉండగా ఏపీకి ఎంత పెదసంఖ్యలో పక్కా ఇళ్లు కేటాయించారో అందరికీ తెలుసు. 1.92 లక్షల ఇళ్లు కేటాయించారు. అలాగే తొలి జాబితాకు అదనంగా కాకినాడను కూడా స్మార్ట్ సిటీ చేశారు. అమరావతి నగరంలో చెప్పుకోడానికి పునాదులు తప్ప ఏమీ లేవుగానీ.. దానికి కూడా స్మార్ట్ సిటీ హోదా కట్టబెట్టేశారు. ఇలా తాను చేయగలిగిందంతా చేశారు. వెంకయ్యనాయుడు - చంద్రబాబు సర్కారుకు అనుకూలంగా ఉన్నాడు గనుక.. ఇదంతా సాధ్యమైందని.. ఇప్పుడు ఆయనే పదవినుంచి పక్కకు మళ్లిపోతున్న సమయంలో స్మార్ట్ సిటీ లాంటి ఘనమైన హామీలు గుప్పిస్తే దెబ్బతింటాం అని తెలుగుదేశం నాయకులే నవ్వుకుంటున్నారు.

ఆ మాటకొస్తే.. తెలుగుదేశం అధినేత ఇస్తున్న హామీలు అయినా.. ఎంత మేరకు జనాన్ని నమ్మిస్తున్నాయన్నది అనుమానమే. ఎందుకంటే.. ఎంత చెడ్డా.. మూడేళ్లు నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా.. ఒకేసారి ఇన్ని వరాలు కురిపిస్తోంటే వారు జీర్ణించుకోలేకపోతున్నారని వినిపిస్తోంది.