Begin typing your search above and press return to search.

రాందేవ్ బాబాపై ఎటకారపు జోకులు

By:  Tupaki Desk   |   22 Jan 2017 4:12 AM GMT
రాందేవ్ బాబాపై ఎటకారపు జోకులు
X
ఫ్రెండ్లీ మ్యాచ్ పేరుతో..ఒలింపిక్ పతక విజేతతో యోగా గురువు రాందేవ్ బాబు ఆడిన కుస్తీ ఆట.. సోషల్ మీడియాలో మహా ఎటకారంగా మారింది. పోటీలో గెలిచిన రాందేవ్ బాబాతో పాటు.. పోటీలో ఓడిన ఆండ్రీ స్టాండిక్ పై వ్యంగ్యాస్త్రాల్ని సంధిస్తున్నారు. 51 ఏళ్ల యోగా గురువు రాందేవ్ బాబా.. ఒలింపిక్ పతకథారి.. రెజ్లర్ అయిన 34 ఏళ్ల ఆంరీ స్టాండిక్ పై 12-0 తేడాతో మట్టి కరిపించటం తెలిసిందే.

అయితే.. ఈ మ్యాచ్ ఫ్రెండ్లీ కావటంతో.. స్టాండిక్ రాందేవ్ కు బాగానే సహకరించారన్న మాట వినిపిస్తోంది. అందుకే.. ఆండ్రీకి అస్కార్ ఉత్తమ సహాయక నటుడి అవార్డును ఇవ్వాలని సోషల్ మీడియాలో ఎటకారం చేస్తున్నారు. అదే సమయంలో యోగా గురువుకు డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని.. అతను గోమూత్రం తాగి మహా బలశాలిగా మారిన వైనం బయటపడుతుందంటూ చతురోక్తులు విసురుతున్నారు.

క్రికెట్ క్రీడను కూడా రాందేవ్ బ్యాటింగ్ తో ప్రారంభిస్తే.. టీమిండియాకు విజయమే తప్పఓటమి అన్నది ఉండదని హాస్యమాడారు. భారత రెజ్లింగ్ చాంఫియన్ సుశీల్ కుమార్ ను గిరగిరా తిప్పి పడేసిన ఆండ్రీని.. రాందేవ్ బాబా మట్టి కరిపించిన వైనం తెలిసిందే. అయితే.. లీగ్ పోటీలకు పతంజలి స్పాన్సర్ చేస్తున్న నేపథ్యంలో.. ఆండ్రీకి బాగా ముట్టజెప్పి ఫ్రెండ్లీ మ్యాచ్ పేరుతో నాటకం ఆడినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చిన్నప్పటి నుంచి గాను యోగా చేస్తున్నానని.. బ్రహ్మ నుంచి శక్తిని సాధించానని చెబుతూ.. రాందేవ్ బాబా అమాయకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని.. తన ఉత్పత్తులకు ప్రచారం తెచ్చుకునే జిమ్మక్కులో భాగమే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ అని అభివర్ణిస్తున్న వారున్నారు. తనకున్న వ్యక్తిగత ఛరిష్మాను తన ఉత్పత్తులకు బదిలీ చేసే క్రమంలోనే బాబా రాందేవ్ కుస్తీ ఆట ఆడి ఉంటారని చెబుతున్నారు.

2011 – 2012 మధ్య కాలంలో రూ.446 కోట్లతో ఉన్న పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు 2015-16 నాటికిరూ.5వేల కోట్లకు పెంచుకోవటం చూస్తే.. యోగా గురువుకు వ్యాపారం చేయటం ఎంత బాగా వచ్చన్నది ఇట్టే అర్థమవుతుంది. ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఆండ్రీకి భారీగా ముట్టజెప్పి కుస్తీ పోటీలో విజయం సాధించేందుకు రాందేవ్ బాబా నాటకం ఆడారన్నది ప్రధాన ఆరోపణ. కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి రెజ్లింగ్ లో శిక్షకుల చేత భారత క్రీడాకారులకు ట్రైనింగ్ ఇచ్చే కన్నా.. రాందేవ్ బాబాను ట్రైనర్ ను చేస్తే.. కోట్లాది రూపాయిల ఖర్చు తగ్గటంతో పాటు.. ఒలింపిక్స్ లో పతకాలు పక్కా అని హాస్యమాడుతున్నారు. మొత్తంగా ఫ్రెండ్లీ కుస్తీ మ్యాచ్ రాందేవ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/