Begin typing your search above and press return to search.

మీ బిడ్డ‌లైతే ఒక‌లా..వేరే వాళ్ల బిడ్డ‌లైతే మ‌రోలానా కేటీఆర్?

By:  Tupaki Desk   |   23 April 2019 8:43 AM GMT
మీ బిడ్డ‌లైతే ఒక‌లా..వేరే వాళ్ల బిడ్డ‌లైతే మ‌రోలానా కేటీఆర్?
X
ఈ మ‌ధ్య‌న త‌న కొడుకు ఫోటోను ట్వీట్ గా పోస్ట్ చేశారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. "13 ఏళ్లకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే గట్టిగా ఓ హగ్ కాకుండా ఇంకేం కోరుకుంటారుష అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు అప్ప‌ట్లో చాలామంది ఫిదా అయ్యారు. ఒక రాజ‌కీయ ప్ర‌ముఖుడు త‌న కొడుకును ఎంత‌గా అభిమానించి.. ఆరాధిస్తాడ‌న్న అర్థం వ‌చ్చేలా ఉన్న ఆ ఫోటోను చూసిన వారంతా ముచ్చ‌ట ప‌డిపోయారు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. అంద‌రు మ‌న‌సుల్ని దోచిన ఫోటోను ప‌ట్టుకొని.. ఇప్పుడు కేటీఆర్ ను ప్ర‌శ్నిస్తున్నారు. మీ కొడుకు అయితే ఇలా.. వేరే వాళ్ల బిడ్డ‌లైతే ఇలానా? అంటూ మ‌హిళ‌ల్ని.. విద్యార్థుల్ని పోలీసులు నెట్టేస్తున్న ఫోటోల‌ను క‌లిపిన ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇంట‌ర్ బోర్డు వైఫ‌ల్యంతో వేలాది మంది విద్యార్థుల మార్క్ షీట్లు లోపాలుగా మారాయ‌న్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు రావ‌టం తెలిసిందే. దీంతో.. ఇంట‌ర్ బోర్డు ద‌గ్గ‌ర నిర‌స‌న చేస్తున్న వారిని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌టం.. ఈ సంద‌ర్భంగా ప‌లువురు విద్యార్థులు.. వారి త‌ల్లిదండ్రుల‌కు పోలీసుల చేతుల్లో చేదు అనుభ‌వం ఎదురు కావ‌టం తెలిసిందే.

ఇంట‌ర్ బోర్డు ద‌గ్గ‌ర విద్యార్థుల్ని.. వారి పేరెంట్స్ ను పోలీసులు ఈడ్చిపారేస్తున్న ఫోటోల‌ను.. కొడుకు ఆలింగ‌నంలో సేద తీరుతున్న కేటీఆర్ ఫోటోను జ‌త చేసి.. మీ బిడ్డ‌లైతే ఒక‌లా.. వేరే వాళ్ల బిడ్డ‌లైతే మ‌రోలానా ? అంటూ క్వ‌శ్చ‌న్ వేస్తున్నారు. ఈ ఫోటో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.