బాబుపై సోషల్ మీడియాలో అదిరిపోయే పంచ్ లు!

Fri May 24 2019 14:26:00 GMT+0530 (IST)

ఒకరిపై అభిమానం.. మరొకరిపై వ్యతిరేకత రాజకీయాల్లో మామూలే. అయితే.. ఇటీవల కాలంలో రాజకీయాల్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకోవటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తమ వాదనను వినిపించే క్రమంలో కాస్తంత ఘాటుగా.. ఎటకారంగా చెప్పేస్తున్న తీరు మరింత పెరిగింది.ఇది.. అధినేతలకు ఇబ్బంది కలిగించే అంశమే.తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దారుణ ఓటమి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనపై పడుతున్న పంచ్ లు అన్ని ఇన్ని కావు. నలభై ఏళ్లే రాజకీయ అనుభవం ఉందని తరచూ చెప్పుకునే చంద్రబాబు 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచారు. .

ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం పాతిక స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పలువురు చంద్రబాబుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. పోల్ మేనేజ్ మెంట్ లో బాబుకున్న సత్తా మామూలు కాదంటూ వినిపించే వాదనకు భిన్నంగా ఫ్యాన్ గాలికి సైకిల్ కదల్లేకపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

బాబుకు ఉన్న గొప్పతనం ఏమంటే.. ఆయన ఎక్కడకు వెళ్లినా.. అక్కడ తన లెగ్ పవర్ చూపిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక సెటైర్ చూస్తే.. ‘ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందని అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖేల్ ఖతమైంది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.. ఆమ్‌ఆద్మీ పార్టీ చిత్తయిపోయింది. ఆయన బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. ఆయన బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తయ్యారు.

ఆయన యూపీ వెళ్లారు.. మాయావతి - అఖిలేశ్ యాదవ్ అడ్రస్ గల్లంతైంది. ఆయన అశోక్ గహ్లోత్ తో తిరిగారు.. రాజస్తాన్‌లో సింగిల్ సీటు కూడా రాలేదు. ఆయన దేవగౌడతో భేటీ అయ్యారు.. ఫస్ట్ టైం ఓడిపోయారు. బాబు లెగ్ పవర్ అలాంటిది. పవర్ లేకున్నా లెగ్ పవర్ తగ్గేది లేదు. తగ్గాల్సింది మనమే తమ్ముళ్లూ’ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు.