ఒక్క మోదీనే తట్టుకోలేకపోతున్న చంద్రబాబుకు ముగ్గురు మోదీలా?

Sat Feb 23 2019 21:25:35 GMT+0530 (IST)

ఈ మధ్యకాలంలో ఏపీ సీఎం సుపుత్రరత్నం లోకేశ్ బాబును ఎక్కువగా ఎక్కడా మాట్లాడనివ్వడం లేదు. అందుకు కారణం ఆయన ఏం మాట్లాడి ఏం కొంప ముంచుతాడో అన్నదే టీడీపీ భయం. అయినా కూడా లోకేశ్ బాబు అప్పుడప్పడు ట్వీట్లతో ఆ ముచ్చట తీరుస్తుంటారు. లోకేశ్ తాజాగా చేసిన ట్వీట్లతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నా నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. దిల్లీలోని మోదీ తెలంగాణ మోదీ కేసీఆర్ ఏపీ మోదీ జగన్ లకు చంద్రబాబే కలలో కూడా గుర్తొస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. అందుకు నెటిజన్లు రివర్స్ కౌంటర్లేస్తున్నారు.
    
ఏపీని అతలాకుతలం చేసేందుకే టీఆర్ ఎస్ వస్తోందనే సంగతి కేటీఆర్ మాటల్లో తేలిపోయిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓడిపోతారంటూ.. నేడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ.. చివరకు 420 జగన్ తో జగకట్టి తెలంగాణకే పరిమితమయ్యారంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘‘ఢిల్లీ మోదీ తెలంగాణ మోదీ కేసీఆర్ ఏపీ మోదీ జగన్‌కు కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ.. చివరకు 420 జగన్ తో జతకట్టి తెలంగాణకే పరిమితం అయ్యారు. టీడీపీ ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్ కు భంగపాటు తప్పదు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక.. ముగ్గురు నాయకులు ఒక్కటై కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడలేక జగన్ తో చేతులు కలిపారు. ఏపీని అతలాకుతలం చేసేందుకు తెరాస వస్తోందనే సంగతి కేటీఆర్ మాటల్లో తేలిపోయింది’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
    
అయితే.. నెటిజన్లు మాత్రం లోకేశ్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో డిఫరెంటుగా స్పందిస్తున్నారు. ఒక్క మోదీ దెబ్బకే మీ నాన్న చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.. అలాంటిది మీరు ఏపీ మోదీ తెలంగాణ మోదీ అంటుంటే ఆయన ఇంకా టెన్షన్ పడతారు జాగ్రత్త లోకేశ్ అంటూ.. సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.