బీసీసీఐ పాతనోట్లు తీసుకుంటుందట!

Tue Jan 10 2017 11:25:25 GMT+0530 (IST)

గత ఏడాది నవంబరు 8 అనంతరం భారతదేశంలో చలామణిలో ఉన్న రూ.500 1000 నోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నోట్ల రద్దు వల్ల దేశానికి కలిగిన ప్రయోజనం నష్టాల సంగతి అలా ఉంచితే... తాజాగా ఆ నోట్లను బీసీసీఐ తీసుకుంటుందంటూ ఆన్ లైన్ లో ఒక పోస్ట్ హల్ చల్ చేసింది. ఈ ఫోటోలో యువరాజ్ సింగ్ ఆశిష్ నెహ్రాల ఫోటోలతో పాటు వాటి కింద "బీసీసీఐ ఇప్పటికీ పాత ఐదువందలు వెయ్యి నోట్లను తీసుకుంటుంది" అని కామెంట్ ఉంది.. ప్రస్తుతం ఈ పిక్ ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది!

సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న వెటరన్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్ అశీష్ నెహ్రాలను తిరిగి ఇంగ్లాండ్ తో జరగనున్న వండే టి-20 సిరీస్ లకు సెలక్టర్లు వీరిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ అభిమానులు చాలా మందిని ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే! దీంతో వీరి ఎంపికపై ఇలా సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అయితే ఈ ఫోటో అటు తిరిగి ఇటు తిరిగి యువరాజ్ సింగ్ వద్దకు కూడా చేరింది. అయితే ఈ విషయాన్ని సరదాగా తీసుకుని పిక్ బాగుందని కామెంట్ చేసిన యూవీ... ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రాం ద్వారా అభిమానులతో షేర్ చేసాడు.

కాగా సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువరాజ్ సింగ్ జట్టులో చోటు దక్కించుకోగా ఇదే క్రమంలో మరోవైపు ఆశిష్ నెహ్రా కూడా సుమారు ఆర్నెళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే జనవరి 15న ఇంగ్లాండ్‌తో పూణెలో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే లో వీరిద్దరూ తమ ఆటతో "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అని నిరూపిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/