Begin typing your search above and press return to search.

చిన్నమ్మ కానీ రూ.10కోట్లు కట్టకుంటే..?

By:  Tupaki Desk   |   21 Feb 2017 2:32 PM GMT
చిన్నమ్మ కానీ రూ.10కోట్లు కట్టకుంటే..?
X
తమిళనాడు సీఎం కుర్చీలో కూర్చోవాల్సిన చిన్నమ్మ.. ఈ రోజు పరప్పన అగ్రహార జైల్లో.. మరొకరితో కలిసి జైల్ రూంను షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏ డబ్బు కోసం ఆశ పడ్డారో.. అందుకోసం ఎన్ని అక్రమాలకుపాల్పడ్డారో.. ఇప్పుడే పాపంగా వెంటాడి మరీ వేధిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరమని చెప్పాలి. ఏ సంపద కోసం ఎంతగా అడ్డదిడ్డంగా వ్యవహరించారో.. ఇప్పుడా సంపద చేతి నిండా ఉన్నా.. వాటికి దూరంగా జైలు గోడల మధ్య బంధీగా ఉండాల్సి రావటం చూసినప్పుడు.. డబ్బు ఎంత పని చేసిందన్న భావన కలగటం ఖాయం.

అదే సమయంలో.. ఇప్పుడనే డబ్బు చిన్నమ్మ శిక్షను అంతకంతకూ తగ్గించే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మకు విధించిన రూ.10కోట్ల జరిమానాను కట్టకుంటే అదనంగా జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయినా.. చిన్నమ్మ ఏంటి? రూ.10కోట్ల జరిమానా కట్టకపోవటం ఏమిటి? ఆమెకు ఉన్న పరిశ్రమలు.. ఆస్తులకు ఈ అమౌంట్ పెద్ద విషయమే కాదు. ఉన్నట్లుండి రూ.10కోట్ల ముచ్చట ఎందుకు వచ్చిందంటారా? ఇక్కడే ఉంది అసలు పాయింట్. అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమైన నేపథ్యంలో.. చిన్నమ్మ శశికళకు నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10కోట్ల జరిమానానుచెల్లించాల్సి ఉంటంది.

ఒకవేళ ఆమెకు కోర్టు విధించిన రూ.10కోట్ల జరిమానాను కట్టని పక్షంలో ఆమె మరో 13 నెలలు జైలుశిక్షను అదనంగా అనుభవించాల్సి ఉంటుంది. ఈ మాట విన్నంతనే.. రూ.10 కోట్లకు 13 నెలల జైలుశిక్ష లెక్కన.. ఇప్పుడు ఆమె జైల్లో ఉండాల్సిన మూడున్నరేళ్ల (అంతకు ముందు ఆర్నెల్లు ఇదే కేసులో జైలుశిక్ష అనుభవించారు)కు ఏదైనా మొత్తాన్ని కడితే సరిపోతుందని చెబితే.. వెనువెంటనే చిన్నమ్మ కట్టేస్తారేమో.

అలాంటి అవకాశాన్ని ఇస్తే.. చిన్నమ్మలు లాంటోళ్లు.. లెక్కలేనన్ని తప్పులు చేసేసి.. పరిహారంగా డబ్బు కట్టల్ని విసిరి మరీ వెళ్లిపోతారేమో. అమ్మ పంచన ఉంటేనే ఇన్ని అక్రమాలు చేసిన చిన్నమ్మ.. ఇక ఆమే.. సీఎం కుర్చీలో కూర్చుంటే పరిస్థితి మరెలా ఉంటుందో..? ఏమైతేనేం.. కోర్టు విధించిన రూ.10కోట్ల జరిమానాను చిన్నమ్మ ఇట్టే కట్టేస్తారని చెప్పాలి. అయినా.. రూ.పది కోట్ల కోసం పద్నాలుగు నెలలు జైల్లో చిన్నమ్మ లాంటోళ్లు ఉంటారా ఏంది..?