Begin typing your search above and press return to search.

జైల్లో చిన్నమ్మ రోజు ఇలా గడుస్తోందట

By:  Tupaki Desk   |   24 Feb 2017 4:53 AM GMT
జైల్లో చిన్నమ్మ రోజు ఇలా గడుస్తోందట
X
అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు సంబంధించిన ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన శశికళ ప్రస్తుతం.. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న తనకు వివిధ సౌకర్యాలు అందించాలని కోరిన శశికళకు కోర్టు ససేమిరా అనటం.. సాదాసీదా ఖైదీగా ఆమె కాలం గడపాల్సి రావటం తెలిసిందే.

చాప.. దుప్పటితో జైలు జీవితాన్ని షురూ చేసి శశికళ.. రోజులు గడుస్తున్న కొద్దీ జైలు జీవితానికి అలవాటు పడినట్లుగా తెలుస్తోంది. జైలుకు రావాల్సి వచ్చిందన్న ఆవేదనతో.. తన బాధను బయటకు ప్రదర్శించకుండా ఉండేందుకు వీలైనంత మౌనాన్ని ఆశ్రయించిన ఆమె.. జైల్లో ఎవరితోనూ మాట్లాడేవారు కాదని చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం తన తీరును కాస్త మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా సుదీర్ఘకాలం పాటు జైల్లో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఉండటంతో.. అందుకు తగ్గట్లే తన మైండ్ సెట్ ను శశికళ మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. జైలుకు వచ్చినప్పుడు నేల మీద పడుకున్న శశికళకు.. ఇప్పుడు ఇనుప మంచం.. రెండు దుప్పట్లు.. టీవీ వసతిని కల్పించారు. రోజూ ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి.. గంట పాటు తన జైలు గదిలోనే యోగా చేస్తన్నారని.. ఆరున్నర గంటల వేళ వేడినీళ్లతో సాన్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

జైలుప్రాంగణంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మ జయలలిత జైల్లో ఉన్నప్పుడు తులసి చెట్టును ఏర్పాటు చేసుకొని రోజూ ప్రార్థనలు జరిపేవారు. ఇప్పుడు శశికళ సైతం అదే సంప్రదాయాన్ని ఆచరిస్తూ.. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం గమనార్హం. అనంతరం ఇంగ్లిష్.. తమిళ దినపత్రికల్ని చదువుతున్న శశికళ.. ఉదయం ఏడు గంటలకు ముందే తన టిఫిన్ ను పూర్తి చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ టీవీ చూస్తున్న ఆమె.. పరిమిత సంఖ్యలోనే సందర్శకుల్ని కలుస్తున్నారు.

రాత్రి 7.30 గంటల సమయంలో డిన్నర్ ముగించి.. రాత్రి పది గంటలకు నిద్రకు ఉపక్రమిస్తున్నట్లుగా చెబుతున్నారు. చిన్నమ్మ జైలుశిక్షను తమిళనాడులోని జైళ్లలోకి మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాని నేపథ్యంలో.. పెరోల్ మీద అయినా ఆమెను బయటకు తెచ్చే అంశం మీద దృష్టి పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్నెల్ల వరకూ పెరోల్ కు పిటీషన్ పెట్టే అవకాశం లేదని చెబుతున్నారు. మరోవైపు అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన శశికళ ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో.. ఈసీ ఆమెకు నోటీసులు పంపారు. దీనికి ఆమె సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/