Begin typing your search above and press return to search.

జస్ట్ ఫర్ ఫన్: శశికళ జైలు డైరీ

By:  Tupaki Desk   |   17 Feb 2017 9:44 AM GMT
జస్ట్ ఫర్ ఫన్: శశికళ జైలు డైరీ
X
పరప్పన అగ్రహార జైలులో శశికళ తెల్లారి నిద్రలేచేసరికి ఆమె కోరుకున్నట్లుగా వ్యక్తిగత సహాయకులు లేకపోయినా జైలులో మహిళా సిబ్బంది మాత్రం పోన్లే పెద్దావిడ అనుకుని రెడీగా అక్కడ నిల్చున్నారు

మేడమ్.. కాఫీ తాగుతారా.. పాలు తెమ్మంటారా? లేదంటే ప్లాన్లు గీసిగీసి, శపథాలు చేసిచేసి అలసిపోయారు కదా బలం కోసం బూస్ట్ తెమ్మంటారా..? అడిగారు సిబ్బంది

అవేమీ వద్దు, కొడయ్ నాడు టీ తీసుకురా. పోయెస్ గార్డెన్లో అక్కతో పాటు అదే తాగేదాన్ని. అక్క పోయాకా అదే తాగుతున్నా.. శశికళ ఆదేశించింది.

ఇది పోయస్ గార్డెన్ కాదు పరప్పన అగ్రహార.. తమిళనాడు కాదు కర్ణాటక. కావాలంటే చిక్ మగుళూర్ కాఫీ తీసుకొస్తా.

అన్నట్లుగానే మాంఛి పొగలు కక్కుతున్న చిక్ మగుళూరు స్పెషల్ కాఫీ తెచ్చారు. మళ్లీమళ్లీ ఎవడొస్తాడు అనుకున్నారో ఏమో దాంతోపాటు బ్రేక్ ఫాస్ట్ కూడా తీసుకొచ్చారు. ఘుమఘుమలాడుతుండడంతో శశికళ మెల్లగా మెడ తిప్పి బ్రేక్ ఫాస్ట్ వైపు చూసింది. ప్లేటు నిండగా పెద్ద దోశ కనిపించింది.

మసాలా దోశేనా..? అడిగింది.

కాదు.. పన్నీర్ దోశ.. జైలు సిబ్బంది సమాధానం

అదిరిపడింది శశికళ.. ఎన్న..?(వ్వాట్) పన్నీరా? పిచ్చెక్కినదానిలా చేత్తో దోశ ప్లేటును విసిరికొట్టింది.

ఎన్నయ్ తూ..(ఏమైంది).. నీకోసం ప్రత్యేకంగా చేయిస్తే విసిరికొడతావా..? మధ్యాహ్నం వరకు ఆకలితో ఏడు. ఇంకేం పెట్టేది లేదు.

అసలే తనను తాను సింహంతో పోల్చుకున్న శశికళ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. కాఫీ మాత్రం తాగేసి టిఫిన్ చేయకుండానే అగరుబత్తీలు - కొవ్వొత్తులు తయారు చేయడానికి వెళ్లిపోయింది.

మధ్యాహ్నమయ్యేసరికి మళ్లీ తన గదికి చేరుకుని అక్క జయలలితతో గడిపిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ నిట్టూర్పులు విడుస్తోంది.

అంతలో జైలు సిబ్బంది మళ్లీ వచ్చారు. భోజనానికి ఏం తేవాలి.. మేమేదైనా తెస్తే విసిరికొడతావ్.. అందుకే నువ్వేం తెమ్మంటే అదే తెస్తాం.

జైలు సిబ్బంది మాటలతో శశికళకు ప్రాణం లేచి వచ్చింది. అసలే టిఫిన్ చేయకుండానే కొవ్వొత్తులు చేయడానికి వెళ్లిపోయింది కదా కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి.

మెల్లగా సిబ్బందిని దగ్గరకు పిలిచి.. బిర్యానీలాంటిదేమైనా దొరుకుతుందా? అని అడిగింది.

జైలు సిబ్బంది కూడా జాలిపడ్డారు. బాగా బతికిన మనిషి కదా..జైలు కూడు ఏం తింటుందిలే అనుకున్నారు. ఏం కావాలో చెప్పమన్నారు.

అంబూరు బిర్యానీ.. చెట్టినాడు చికెన్ కర్రీ.. చెప్పింది శశికళ.

ఎన్నిసార్లు చెప్పాలి ఇది పరప్పన అగ్రహార అని. నీకు బిర్యానీ పెట్టడమే ఎక్కువ. నాన్ వెజ్ పెట్టాలో వద్దో మా ఆఫీసర్లను అడిగి చెప్పాలి. కావాలంటే దగ్గర్లో హోసూరు రోడ్లో మంచి హోటళ్లున్నాయ్. అక్కడి నుంచి పన్నీర్ బిర్యానీ తెప్పిస్తాం. ఇంకా కావాలంటే పాలక్ పన్నీర్ - పన్నీర్ బటర్ మసాలా - కడయ్ పన్నీర్ వంటి కర్రీస్ కూడా తెప్పిస్తాం.

శశికళకు కోపం నషాళానికంటింది.. ఆవేశంతో ఊగిపోయింది. నాకేమీ వద్దు.. ఇక్కడినుంచి పొండి అంటూ పెద్దపెద్ద కేకలు వేసింది.

సీఎం సీట్లో కూర్చోవాల్సిన టైంలో జైల్లో కూర్చోవాల్సి రావడంతో బాగా అప్ సెట్ అయ్యి అలా అరుస్తోందిలే అనుకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాస్త మంచినీళ్లు తాగి చిన్న కునుకు తీసింది శశికళ. ఎడతెగని ఆలోచనలతో కొద్దిసేపు నిద్రపట్టకపోయినా కొవ్వొత్తులు చేసిచేసి అలసిపోవడంతో మెల్లగా నిద్ర కమ్ముకొచ్చేసింది. మళ్లీ సిబ్బంది వచ్చేవరకు మెలకువ రాలేదు. భుజంపైన, వీపుపై చరుస్తూ నిద్రలేపేశారు జైలు సిబ్బంది. ఇదేమీ పోయస్ గార్డెన్ కాదు హ్యాపీగా పడుకోవడానికి లేలే.. అంటూ నిద్ర లేపేశారు. నిద్రలేపడంలో మొరటుగా ప్రవర్తిస్తే ప్రవర్తించారు గానీ తమతో పాటు ప్లేటులో స్నాక్సు మాత్రం తీసుకొచ్చారు.

ఇవి తిను.. సాయంత్రం డీజీపీ సార్ వస్తారు - నీకు స్పెషల్ ఎరేంజిమెంట్లు చేయాలో వద్దో డిసైడ్ చేస్తారు అని చెబుతూ స్నాక్సు ప్లేటు ఆమె ముందుకు తోశారు. అందులో పకోడీలు ఉన్నాయి..

ఆవురావురుమంటున్న శశికళ ఒక్కసారి నాలుగైదు పకోడీలు చేత్తో తీసుకుని నోట్లో వేసుకుంది.. పంటికింద పకోడీ మెత్తగా నలిగిపోతుంటే, కరకరమనాల్సిన వేడివేడి పకోడీ ఇంత మెత్తగా ఉందేమిటా అనుకుని ఏం పకోడీ ఇదని అడిగింది.

పన్నీర్ పకోడీ.. చెప్పారు సిబ్బంది

అంతే.. తోక తొక్కిన తాచులా లేచింది శశికళ. కళ్లు ఎర్రబడిపోయాయి. ఇంకెప్పుడూ ఇలాంటి పనికిమాలిన పకోడీలు తేవొద్దంటూ ఆగ్రహంతో ఊగిపోయింది.

నాల్రోజులు ఇలాగే ఉంటుంది.. ఆ తరువాత సెట్ అయిపోతుందిలే అనుకుంటూ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్లీ రాత్రి 8 గంటలకు వచ్చారు.వస్తూవస్తూ రాత్రి భోజనం కూడా తెచ్చేశారు. మధ్యాహ్నం పన్నీర్ బిర్యానీ పేరు చెప్పగానే శశికళ కోపగించడంతో ఆమెకు అది నచ్చదేమోలే అనుకుంటూ రాత్రికి భోజనం చేస్తుందో లేదో.. అసలే 60 దాటాయి, షుగర్ - బీపీ వంటివి ఉండొచ్చనుకుంటూ పరోటా తెచ్చారు. అయితే, సాదా పరోటా కంటే కాస్త రుచిగా ఉంటుందని పన్నీర్ పరోటా - దాంతో పాటు ఒంటికి చలవ చేస్తుందని పాలక్ పన్నీర్ కూర తెచ్చారు.

సాయంత్రం పకోడీల అనుభవంతో జాగ్రత్తపడిన శశికళ ఈసారి ముందే అదేమిటని అడిగింది.

పన్నీర్ పరోటా.. చెప్పారు సిబ్బంది.

కోపం తమాయించుకున్న శశికళ.. మరి ఆ కూరేమిటి? అని అడిగింది.

పాలక్ పన్నీర్...

జైలు సిబ్బంది నోటి నుంచి ఇంకా ఆ మాట పూర్తిగా రానే రాలేదు శశికళ ఉగ్రసింహంలా మారిపోయింది.. ప్లేట్లను విసిరికొట్టింది. చదవడానికి పొద్దున్న ఇచ్చిన ఇంగ్లీష్ పేపర్లను చించిపడేసింది. చేతికి దొరికిన సిబ్బందిని నోటితో కరిచేసింది. నానా భీభత్సం సృష్టించింది. పన్నీర్ అంటేనే నాకు మంట.. ఇప్పుడు పాలక్ పన్నీర్ అంటారా? జైల్లో ఉన్నా నేనే పాలక్.. నేనే సీఎం. అంటూ మూడుసార్లు జైలు గోడలపై చేత్తో గట్టిగా కొడుతూ మూడు శపథాలు చేసింది.

‘‘పదేళ్ల తరువాత సీఎం అవుతా.. తమిళనాడులో పన్నీర్ ను నిషేధిస్తా’’ మొదటి శపథం.

‘‘పన్నీర్ అంటే ఇష్టపడేవారు ఎవరైనా పొరుగు రాష్ట్రాల నుంచి రహస్యంగా తెచ్చుకుని తింటే వారికి యావజ్జీవ శిక్ష వేసేలా చట్టం చేస్తా’’ రెండో శపథం

‘‘పన్నీర్ కు బదులు పళని అనే ఆహారపదార్థం తయారుచేయిస్తా. ఉచిత పళని పథకాన్ని గ్రామగ్రామాన అమలు చేస్తా’’ మూడో శపథం.

... ఆ మూడు శపథాలు వినేసరికి జైలు సిబ్బందికి అసలు విషయం అర్థమైంది. పొద్దున్నుంచి పన్నీర్ పేరెత్తితే శశికళ ఎందుకంత మండిపోతోందో తెలిసిపోయింది. పరప్పన అగ్రహారలో శశికళ ఉన్నంతవరకు పన్నీర్ అన్న పేరెత్తకుండా ఉంటే దెబ్బలు తినకుండా తప్పించుకోగలం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/