Begin typing your search above and press return to search.

‘నోబుల్’తో ఆమెకు ఇమేజ్.. ఆయనకు డ్యామేజ్

By:  Tupaki Desk   |   10 Jan 2017 7:10 AM GMT
‘నోబుల్’తో ఆమెకు ఇమేజ్.. ఆయనకు డ్యామేజ్
X
ఒకే విషయం ఒకరికి లాభం చేస్తే.. మరొకరికి నష్టం చేకూర్చింది. అలా అని వేర్వేరు కాలాల్లో జరిగితే సర్లే అని అనుకోవచ్చు.కానీ.. రోజుల తేడాతో ‘నోబుల్’ మాట ఇద్దరు రాజకీయ అధిపతులకు చేసిన లాభ.. నష్టాలు చూస్తే చాలానే విషయాలు అర్థమవుతాయని చెప్పక తప్పదు. తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. నోబుల్ బహుమతి ప్రస్తావన తీసుకురావటం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు తమ సత్తా చాటుతున్నారని.. అయినప్పటికీ ఒక్క నోబుల్ ప్రైజు కూడా రాలేదంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతలోనే ఆయన ఊహించని రీతిలో చేసిన వ్యాఖ్య అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. నోబుల్ బహుమతిని సాధించే తొలి తెలుగు వ్యక్తికి తమ ప్రభుత్వం రూ.100 కోట్లు నజరానాగా ఇస్తుందని చెప్పి షాకిచ్చారు.

నోబుల్ బహుమతి సాధించటం లక్ష్యంగా పెట్టుకోవటం ఒక ఎత్తు. కానీ.. దాన్ని సాధించినోళ్లకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రూ.100కోట్ల నజరానా ఇస్తానని చెప్పటం సంచలనంగా మారటమే కాదు.. పలువురి నోట విమర్శలు వచ్చేలా చేసింది. మౌలిక సదుపాయాలు ఏ మాత్రం సరిగా లేని రాష్ట్రంలో.. ప్రజలకు అవసరమైన కనీస అవసరాల్ని తీర్చే విషయంలో వెనుకబాటులో ఉన్న రాష్ట్రం నోబుల్ ప్రైజ్ సాధించిన తెలుగు వ్యక్తికి రూ.100కోట్లు ఇస్తామనటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నోబుల్ తో బాబు చేసిన ప్రకటన ఆయన్ను భారీగానే డ్యామేజ్ చేసిందని చెప్పక తప్పదు. విశేష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి అధినేత నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్య రావటమా?అన్న సందేహం పలువురి నోట వచ్చింది. ఆశ్చర్యకరంగా ఇదే నోబుల్ మాటతో మరో రాజకీయ అధినేత్రి ప్రజల మనసుల్ని దోచుకోవటమే కాదు.. ఆమె ఇమేజ్ పెరిగేలా చేసిందని చెప్పాలి.

అమ్మ తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేయాలని తహతహలాడుతున్న అన్నాడీఎంకే అధినేత చిన్నమ్మ.. ఇటీవల ఒక డిమాండ్ చేశారు. అమ్మగా తమిళ ప్రజలు కొలిచే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నోబుల్ బహుమతి ప్రకటించాలంటూ డిమాండ్ చేసింది. అమ్మ బతికి ఉన్నప్పుడు ఆమె ఇంటి వ్యవహారాలు చూసుకునే ఒక మహిళ.. రాజకీయ అవగాహన అంతంతమాత్రమేనన్న విమర్శలు ఎదుర్కొనే మహిళ నోటి నుంచి వచ్చిన నోబుల్ మాట తమిళుల మనసుల్ని దోచుకోవటమే కాదు.. నోబుల్ బహుమతి తమ అమ్మకు ఎందుకు ఇవ్వకూడదన్న వాదనను తమిళులు చేసే వరకూ వచ్చింది.

ఒకే మాట.. ఇద్దరు అధినేతల ఇమేజ్ మీద చూపించిన ప్రభావం చూస్తే.. ఎప్పుడు ఎలా మాట్లాడాలన్నది కీలకాంశంగా కనిపిస్తుంది. ఏమైనా.. నోబుల్ మాట చంద్రబాబుకు చేదు అనుభవాన్ని మిగిలిస్తే.. చిన్నమ్మకు మాత్రం లాభాన్ని చేకూర్చిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/