Begin typing your search above and press return to search.

చిన్నమ్మకు పరప్పన జైలేనా..?

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:28 AM GMT
చిన్నమ్మకు పరప్పన జైలేనా..?
X
చిన్నమ్మ టైం ఏమాత్రం బాగోలేదు. ఆ విషయం చేతి వరకూ వచ్చి చేజారిన ముఖ్యమంత్రి పదవి ఇష్యూతోనే తేలిపోయింది. అది జరిగిన రెండు మూడు రోజులకే రెండు దశాబ్దాలుగా సా..గుతున్న అక్రమాస్తుల కేసు ఒక కొలిక్కి రావటమే కాదు.. దోషిగా తేలిపోయి.. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం పదవి చేపట్టాలన్న ఆశతో మొదలైన బ్యాడ్ టైం నేటికీ కొనసాగుతుందని చెప్పాలి.

నమ్మిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి.. చక్రం తిప్ప గలిగిన చిన్నమ్మ.. తన విషయంలోనే ఏమీ చేసుకోలేకపోతున్నారు. కనీసం.. తానున్న పరప్పన అగ్రహార జైలు నుంచి బయటపడి.. తమిళనాడులోని చెన్నై జైల్లోనో.. మధురై జైల్లోనో కాదంటే వేలూరు జైల్లోనో ఉండాలన్న ప్రయత్నాల్ని జోరుగా చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ఆమె ప్రయత్నాలు వర్క్ వుట్ అయ్యే చాన్స్ లు ఉన్నట్లుగా కనిపించట్లేదు.

చిన్నమ్మను పరప్పన జైలు నుంచి వేరే జైలుకు మార్చేందుకు ఆమె లాయర్లు అద్భుతమైన పాయింట్ ను బయటకు తీశారు. ఆమెకు ప్రాణహాని ఉందన్న మాటను తెరపైకి తెచ్చారు. దీనికి కాస్త ముందుగా.. చిన్నమ్మ బ్యారెక్ పక్కనే.. నరహంతకురాలు సైనేడ్ మల్లిక ఉందన్న ప్రచారం మీడియాలో భారీగా వార్తలు వచ్చాయి. చిన్నమ్మ లాయర్లు రియాక్ట్ అయి.. కోర్టు దృష్టికి తీసుకెళ్లే సమయానికే.. జైలు అధికారులు వేగంగా స్పందించి.. చిన్నమ్మ పక్క సెల్లో ఉన్న సైనేడ్ మల్లికను హుటాహుటిన బెళగావిలోని హిందల జైలుకు మార్చారు.

దీంతో.. ఏదోలా చిన్నమ్మను జైలు నుంచి వేరే జైలుకు మార్చాలన్న ప్రయత్నాలకు గండిపడినట్లేనని చెబుతున్నారు. జైలు అధికారులు స్పందిస్తున్న తీరుతో.. కోర్టు సైతం చిన్నమ్మను వేరే జైలుకు మార్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. శశికళ.. ఆమెతో పాటు దోషులుగా తేలిన ఇళవరసి.. సుధాకరన్ లు ముగ్గురూ పరప్పన జైల్లోనే జైలుశిక్షను అనుభవిస్తున్నసంగతి తెలిసిందే.

ఇళవరసి చిన్నమ్మతో కలిసి జైలు గది పంచుకోగా.. సుధాకరన్ ను మాత్రం పురుషుల విభాగంలో ఉంచినట్లుగా చెబుతున్నారు. ముగ్గురిని సాధారణ ఖైదీలుగానే చూస్తున్నట్లుగా జైలు అధికారులు చెబుతున్నారు. వారికి మామూలు భోజనాన్ని పెడుతున్నామని.. ఎప్పటికప్పుడువైద్య పరీక్షలు జరుపుతున్నారు. ముగ్గురూ ఒకేచోట కలిసి కూర్చొని టీవీ చూసే అవకాశాన్ని కల్పించినట్లుగా జైలు అధికారులు చెబుతున్నారు. సో.. చిన్నమ్మ జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/