Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఓ గ‌జిని, పిచ్చోడు: సర్వే

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:45 AM GMT
కేసీఆర్ ఓ గ‌జిని, పిచ్చోడు: సర్వే
X
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును నిరసిస్తూ జ‌రుగుతున్న నిర‌స‌న‌ల్లో పాల్గొనేందుకు అక్క‌డికి వెళ్లిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స‌ర్వే మాట్లాడుతూ దుయ్య‌బ‌ట్టారు. సీఎం కేసీఆర్ ఒక గజిని అని - ఆయనకు మతిమరుపులు ఎక్కువని - రాత్ గయా.. బాత్ గయా అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుందన్నారు. పిచ్చోని చేతిలో రాయి .. కేసీఅర్ చేతిలో అధికారం అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షణికావేశంలో వచ్చిన సీఎం అని - ముఖ్యమంత్రి పదవి ఆయనకు ఇప్పుడు కోతికి కొబ్బరికాయలా దొరికిందన్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి ఉందని స‌ర్వే ఎద్దేవా చేశారు.

పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తే కాంగ్రెస్ సమర్థిస్తుందని, అయితే ప్రజల అభీష్టం మేరకే ఉండాలని స‌ర్వే డిమాండ్ చేశారు. ప్రజలకిష్టం లేకపోయినా స్వార్థ రాజకీయాల కోసం బలవంతంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పవిత్ర యాదగిరిగుట్టకు ఆంధ్రా పేరైనా యాదాద్రిగా నామకరణం చేశారని, అంతేకాకుండా ఎవరు కోరుకోకున్నా యాదాద్రి జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నార‌ని ఆరోపించారు. యాదాద్రి జిల్లా ఏర్పాటు కేవలం సీఎం సమీప బంధువుల కోసమే తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. జిల్లా ఏర్పాటు ప్రతిపాదనకు ముందే వారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో యాదగిరిగుట్ట సమీపంలో వేల ఎకరాల భూములను ఆయన సమీప బంధువైన రామేశ్వర్‌ రావు - మరికొంత మంది కొనుగోలు చేశారని, కేవలం వారి భూముల కోసమే యాదాద్రి జిల్లా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.

మరో వైపుప్రజల నుండి ఎలాంటి డిమాండ్ లేకపోయినా హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయడం వెనక మాజీ మంత్రి - రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు - ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ల హస్తం ఉందని స‌ర్వే ఆరోపించారు. వారి కోసమే చారిత్రక నగరమైన వరంగల్‌ను విడదీసి హన్మకొండ జిల్లాగా చేయాలని సీఎం కుట్ర పన్నార‌ని మండిప‌డ్డారు. ఎన్నికల సందర్భంగా జనగామ ప్రజలకిచ్చిన హామీ మేరకు, అక్కడి ప్రజల బలమైన ఆకాంక్ష కోసం జనగామ జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రతిపాదన విరమించుకోకున్నా, జనగామ జిల్లా ఏర్పాటు చేయకున్నా కాంగ్రెస్ ఊరుకోదన్నారు. త్వరలోనే ఈ రెండు అంశాలపై వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని స‌ర్వే హెచ్చరించారు. 2019లో అధికారం మాదేనని, సీఎం కేసీఆర్ తుగ్లక్ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, ఈ హామీల నుంచి తప్పించుకునేందుకే ఒక్కోసారి ఒక్కో అంశాన్ని తెరపైకి తీసుకొస్తు కాలం వెల్లదీస్తున్నాడని అన్నారు. కేసీఆర్ వ్యవహార తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని, తిరగబడే రోజులు దగ్గరలోనే ఉందని స‌ర్వే వ్యాఖ్యానించారు.