Begin typing your search above and press return to search.

దోశాకింగ్‌ గా ఎదిగి...దిక్కులేని రీతిలో క‌న్నుమూసి..

By:  Tupaki Desk   |   19 July 2019 10:58 AM GMT
దోశాకింగ్‌ గా ఎదిగి...దిక్కులేని రీతిలో క‌న్నుమూసి..
X
మీ జాత‌కం ప్రకారం ఆ ఒక్క ప‌ని చేయండి చాలు.. మీ సుడి మొత్తం తిరిగిపోతుందంటూ చెప్పే మాట‌లు ఏ స్థానంలో ఉన్నోడినైనా ఇట్టే అక‌ర్షిస్తాయి. రాజుకు సైతం కొత్త ఆశ‌లు పుట్టించే న‌మ్మ‌కం.. గుడ్డిగా న‌మ్మేస్తే ఎంత దారుణ ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని చెప్ప‌టానికి తాజా ఉదంతం ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. శరవణ భవన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని హోట‌ల్స్‌. ఆ హోటల్స్ వ్యవస్థాపకుడు పీ రాజగోపాల్ (73) కూడా అంతే ప్ర‌ముఖుడు. . ఉల్లిపాయ‌లు అమ్ముకునే కుటుంబంలో పుట్టి 1981లో పొట్ట చేత ప‌ట్టుకొని చెన్నైలో కిరాణా వ్యాపారాన్ని షురూ చేశారు రాజ‌గోపాల్. త‌న స్థాయికి మించిందైనా.. త‌న మీద త‌న‌కున్న న‌మ్మ‌కంతో శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ ను ఏర్పాటు చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే కాదు.. విదేశాల్లో 80 శాఖ‌ల్ని ఏర్పాటు చేసి దోశ‌ల రాజుగా పేరు గ‌డించాడు. ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయ‌న అకాల మ‌ర‌ణానికి కార‌ణం, వ‌య‌సు పైబ‌డ‌టం కాదు. అత్యాశ‌తో త‌ప్పులు చేయ‌డం.

`దోశకింగ్` గా పేరొందిన రాజగోపాల్ మూడో వివాహం చేసుకుంటే వ్యాపారం కలిసొస్తుందని ఆయనకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. దీంతో తన హోటల్ ఉద్యోగి కుమార్తెతో మూడో వివాహానికి ప్రయత్నించాడు. అదే హోటల్ ఉద్యోగి ప్రిన్స్ శాంతకుమార్‌ తో అప్పటికే వివాహం కావడంతో ఆయన ప్రలోభాలకు ఆమె లొంగలేదు. అయితే, ఎలాగైన త‌న వ‌శం చేసుకోవాల‌ని ఆయ‌న భావించాడు. 2001అక్టోబర్‌లో ఆమె భర్తను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. ఈ కేసులో స్థానిక కోర్టు రాజగోపాల్‌ తోపాటు 8 మంది దోషులకు పది సంవ‌త్స‌రాల‌ జైలు శిక్ష విధించింది. బాధితులు అప్పీల్ చేయగా మద్రాసు హైకోర్టు 2009లో దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చింది. రాజగోపాల్ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థ్ధించి వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.

అయితే, అనారోగ్యం పేరిట లొంగిపోయేందుకు గడువు కోసం దాఖ లు చేసిన పిటిషన్‌ ను తిరస్కరించింది. దీంతో రాజగోపాల్ ఈ నెల 9న అంబులెన్స్‌లో వచ్చి స్థానిక కోర్టులో లొంగిపోగా పుళల్ జైలుకు తరలించారు. 13న గుండెపోటు రావడంతో స్టాన్లీ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యా నికి ప్రైవేట్ దవాఖానకు తరలింపునకు ఆయన కుమారుడి అభ్యర్థనకు హైకోర్టు మంగళవారం అంగీకరించింది. రాజగోపాల్‌ కు విజయ హెల్త్ సెంటర్‌ లో చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించి గురువారం ఉదయం చనిపోయాడని వైద్యులు తెలిపారు. పట్టుదలతో జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన రాజగోపాల్... మరింత ఎత్తుకు ఎదగడానికి కూడా అదే పట్టుదలతో కృషిచేయడమే మార్గమని తెలుసుకోలేకపోయిన ఆయన జీవితం చిన్నగా మొదలై ఉన్నతంగా ఎదిగి, నీచంగా పతనమైంది.

రాజగోపాల్ కెరీర్ :
తొలుతు కోయంబత్తూరులోని రెస్టారెంటులో క్లీనర్ జాబ్
మైలాపూర్ లో బంధువుల కిరాణా దుకాణంలో హెల్పర్ ఉద్యోగం
వంట పాత్రల షాపులో సేల్స్ మెన్
1970లో సొంతంగా చిన్న కిరాణా షాపు ప్రారంభం
తర్వాత డిపార్టమెంటల్ స్టోర్ గా విస్తరణ
1981లో శరవణ భవన్ తొలి శాఖ ప్రారంభం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 27 శాఖల ఏర్పాటు (చెన్నైలో ఒక్కటే 20)
ఇతర దేశాల్లో మరో 23 శాఖలున్నాయి

హత్య కేసుపూర్వాపరాలు :
తన వద్ద పనిచేసే వ్యక్తి కూతురి జీవజ్యోతిపై మోజు, మూడో భార్యగా చేసుకోవాలని ఆరాటం
రాజగోపాల్ ప్రతిపాదన తిరస్కరించి కూతురికి మరొకరితో వివాహం చేసిన తండ్రి
జీవజ్యోతి భర్తను హత్య చేయించిన రాజగోపాల్
2001లో హత్య, శవం కనుగొన్న పోలీసులు, రాజగోపాల్ అరెస్టు
2004లో రాజగోపాల్ కు పదేళ్ల జైలు శిక్ష
2009లో మద్రాసు హైకోర్టులో యావజ్జీవం విధింపు
2019 మార్చి లో మద్రాసు కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం.
2019 జులై 7న లొంగిపొమ్మని సుప్రీం ఆదేశం
2019 జులై 9న అనారోగ్యం బారిన రాజగోపాల్
2019 జులై 18న గుండెపోటుతో మరణం.