Begin typing your search above and press return to search.

దక్షిణాది వాళ్లంటే ఆ క్రికటర్ కి ఎంత చులకన?

By:  Tupaki Desk   |   18 Feb 2017 5:15 PM GMT
దక్షిణాది వాళ్లంటే ఆ క్రికటర్ కి ఎంత చులకన?
X
దక్షిణాది వారిని చిన్నచూపు చూసేలా వ్యవహరించటం ఉత్తరాది వారికి అలవాటే. ఇప్పుడీ మాట తరచూ వినిపించినా.. ఇలాంటి వైఖరి ఎప్పటి నుంచో ఉన్నదే. చాలామంది మరిచిపోతారు కానీ.. అప్పుడెప్పుడో మన మెగాస్టార్ చిరంజీవికి రుద్రవీణ సినిమాకి జాతీయఅవార్డు వచ్చినప్పుడు.. ఉత్తరాది వారు తన పట్ల వ్యవహరించిన వైనంపై అప్పట్లో పెదవి విప్పారు.

సాటి కళాకారుడన్న అభిమానాన్ని కూడా వారుప్రదర్శించలేదని.. వారి తీరు తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. చిరంజీవి ఇంటర్వ్యూల్ని జాగ్రత్తగా ఫాలో అయితే.. ఆయన ఆవేదన గుర్తు ఉండి ఉండే ఉంటుంది. కట్ చేస్తే.. ఇలాంటివెన్నో ఉదంతాలు కనిపిస్తాయి. చిరు దాకా ఎందుకు.. తెలుగు మాట్లాడే వారు పది కోట్లకు పైనే ఉన్నారు. అయినప్పటికీ.. ఇప్పటికి తెలుగువాళ్లను మాద్రాసీలుగా చూసే చిన్నబుద్ధి వారి సొంతం.

ఇలాంటి విషయాలతో పాటు.. విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామన్న హోదా విషయంలో మోడీ అండ్ కో వ్యవహరిస్తున్న వైఖరిపై పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడుతూ.. దక్షిణాదివారంటే ఉత్తరాది వారికి ఎందుకంత చులకన అంటూ ఫైర్ అవుతుంటారు. అదేంటి పవన్ లాంటోడు.. తరచూ ఉత్తరాది.. దక్షిణాది అంటూ మాట్లాడతారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నా.. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. పవన్ మాటల్లో నిజం ఇట్టే కనిపిస్తుంది.

తమిళనాడు రాజకీయ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రముఖ క్రికెటర్ (మాజీ) సంజయ్ మంజ్రేకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. దక్షిణాది వారిపట్ల మరీ ఇంత చులకనా? అన్న భావన కలగటం ఖాయం. తనకు తమిళనాడు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని.. తమిళ రాజకీయ నాయకులు పేర్లు చాలా క్లిష్టంగా ఉంటాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన తీరు చూస్తే.. ఉత్తరాది అహంకారం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. విదేశీయులకు ఉండే చిత్రవిచిత్రమైన పేర్లను.. అలవోకగా పలికే కామెంటరేటర్ ఉద్యోగం చేసే సంజయ్ కి దక్షిణాది వారి పేర్లు పలకటంలో అంత నొప్పేంటో..? తెల్లతోలు ఉన్న వారి పేర్లు ఎంత కష్టంగా ఉన్నా.. ఇష్టంగా వచ్చేస్తాయా ఏంటి..? అంటూ నెటిజన్లు కడిగిపారేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/