Begin typing your search above and press return to search.

ఇలాంటి వాటితో ఎంత డ్యామేజ్ బాబూ?

By:  Tupaki Desk   |   24 Aug 2016 6:26 AM GMT
ఇలాంటి వాటితో ఎంత డ్యామేజ్ బాబూ?
X
వందల కోట్ల రూపాయిల్ని ఖర్చు చేసి.. లక్షలాది రూపాయిల విషయంలో వ్యవహరించే తీరు అప్పటివరకూ వచ్చిన పేరు మొత్తాన్నిపోగొడుతుందన్న విషయాన్ని ఏపీ సర్కారు ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిది. పన్నెండు రోజుల పాటు నభూతో అన్న రీతిలో నిర్వహించిన కృష్ణా పుష్కరాలతో ఏపీ సర్కారుకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా బాధ్యత తీసుకొని నిత్యం పుష్కర ఘాట్ల చుట్టూ తిరుగుతూ.. అధికారుల్ని ఉత్సాహపరుస్తూ ఆయన పడిన కష్టం అంతాఇంతాకాదు.

పుష్కరాలతో బెజవాడ రూపురేఖల్ని పూర్తిగా మార్చేసిన చంద్రబాబు.. ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో తెలియజేయాలన్న ఉద్దేశంతో జాతీయ మీడియా సంస్థల్ని ప్రత్యేకంగా రప్పించి మరీ పుష్కర ఏర్పాట్లు పరిశీలించాలన్న ఆయన కాన్ఫిడెన్స్ చూస్తేనే.. బెజవాడలో పుష్కర ఏర్పాట్లు ఎంత ఘనంగా జరిగాయన్నది అర్థమవుతుంది. అంతా బాగా జరిగి.. పుష్కరాల్ని విజయవంతంగా పూర్తి చేశామన్న ఆనందంలో ఉన్న ఏపీ సర్కారుకు ఊహించని చిన్న షాక్ తగిలింది.

పుష్కర పనుల్లో శ్రమించిన పారిశుద్ధ్యం కార్మికులకు అధికారులు కూలీలు ఇవ్వకపోవటంతో ఆగ్రహం చెందిన వారు ఆందోళనల బాట పట్టారు. 12 రోజుల పాటు విరామం ఎరుగకుండా పారిశుద్ధ్యం విషయంలో కష్టపడితే.. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా వారికి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. పుష్కరాల ప్రారంభం ముందు తమతో మాట్లాడుకున్న విధంగా డబ్బులు చెల్లించకుండా తమను మోసం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలాంటి పనులతో ఏపీ సర్కారుకు నేరుగా పాత్ర ఉండనప్పటికీ.. ఈ కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించిన వారి కారణంగా ప్రభుత్వం విమర్శలకు గురి కావాల్సిన పరిస్థితి. పుష్కరాల్ని ఘనంగా ముగించామన్న సంతోషంలో ఉన్న చంద్రబాబు సర్కారుకు ఇలాంటి ఆందోళనలు ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.