మోడీ వారసుడ్ని సంఘ్ ముందే ప్లాన్ చేస్తుందా?

Sat Feb 09 2019 11:30:49 GMT+0530 (IST)

ఎవరు అవునన్నా.. కాదన్నా బీజేపీ వెనుక సంఘ్ ఉందన్నది బహిరంగ రహస్యమే. తెర మీద కనిపించే దృశ్యం వెనుక స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసేది మాత్రం సంఘ్ పరివారే. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అనుకున్న రీతిలో బీజేపీకి సీట్లు రాకుంటే ఏం చేయాలి?  మోడీ వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నట్లుగా వస్తున్న కథనాల నేపథ్యంలో సంఘ్ అలెర్ట్ అయినట్లు చెబుతున్నారు.2014 ఎన్నికల వేళలో ఎన్డీయేతో జత కట్టిన పలు మిత్రపక్షాలు ఇప్పుడు దూరంగా ఉండటం తెలిసిందే. కొత్త మిత్రులు వచ్చింది తక్కువ.. వెళ్లిపోయిన మిత్రులు ఎక్కువగా ఉండటం.. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకుంటే ఏం చేయాలన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సంఘ్ పెద్దలు ఇప్పటికే ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

మోడీకి ప్రత్యామ్నాయంగా ఇటీవల కాలంలో విపక్షాల మనసుల్ని దోచుకుంటున్న నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా తెర మీదకు తెస్తే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. గడ్కరీ కాదంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను నియమించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంఘ్ వరకూ వస్తే నితిన్ గడ్కరీ.. శివరాజ్ సింగ్ చౌహాన్ లు ఇద్దరూ రెండు కళ్లు లాంటివారిగా చెబుతారు. జాతీయ స్థాయిలో వారు చక్రం కానీ తిప్పితే అన్ని వర్గాల వారిని కలుపుకుపోయే తత్త్వం వారిలో ఎక్కువన్న ఆలోచన ఉంది. ఒకవేళ గడ్కరీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటే శివసేన హ్యాపీగా ఓకే చెబుతుందని.. దూరమైన మిత్రుల్లో కొందరు దగ్గరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

మిత్రులతో పాటు సొంత పార్టీలోని కొందరు కీలక నేతల్ని మోడీషాలు దూరం చేసుకున్నట్లు చెబుతున్నారు. మోడీషాలపై అసంతృప్తితో ఉన్న వారు టైం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఇటీవల కాలంలో మోడీపై గడ్కరీ నర్మగర్భ వ్యాఖ్యల వెనుక అసలు విషయం సంఘ్ మద్దతు ఉండటమేనని చెబుతున్నారు. సంఘ్ ఆశీస్సులతోనే గడ్కరీ అలా మాట్లాడగలుగుతున్నారని.. లేకుంటే అంత ధైర్యం ఆయనకు లేదన్న మాట వినిపిస్తోంది.

తనను విమర్శించిన వారిని ఓ పట్టాన వదిలిపెట్టని మోడీ.. సొంత పార్టీకి చెందిన గడ్కరీ పరోక్ష విమర్శలు చేయటం.. అందుకు రాహుల్.. సోనియాలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలోనూ మౌనంగా ఉండటానికి కారణం సంఘ్ గా చెబుతున్నారు.ఎన్నికలకు ముందే మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి పెట్టుకున్న సంఘ్ తీరు చూస్తే.. ముందుచూపు చాలా ఎక్కువగా ఉండటమే కాదు.. వాస్తవాల్ని వాస్తవాలుగా చూసే ధోరణి సంఘ్ లో ఉందన్న భావన కలుగక మానదు.