Begin typing your search above and press return to search.

వామ్మో వాషింగ్ మెషీన్లు పేలిపోతున్నాయ్..

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:28 PM GMT
వామ్మో వాషింగ్ మెషీన్లు పేలిపోతున్నాయ్..
X
ప్రఖ్యాత శాంసంగ్ కంపెనీ టైం ఏమాత్రం బాగోలేనట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్యనే సదరు కంపెనీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన మొబైల్ ఫోన్లు పేలిపోవటం.. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన ఆ ఫోన్లు వెనక్కి తీసుకొచ్చే పని మొదలెట్టిన శాంసంగ్ కు ఇప్పటికే.. పేలిన సెల్ ఫోన్లతో చికాకులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇది చాలదన్నట్లుగా తాజాగా ఆ సంస్థ ఉత్పత్తిఅయిన వాషింగ్ మెషీన్లు కూడా పేలిపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా ఫెడరల్ కోర్టులో దాఖలైన కేసు ప్రకారం.. శాంసంగ్ కంపెనీ వాషింగ్ మెషీన్ పేలిందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

శాంసంగ్ కు చెందిన టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్లో బట్టలు వేసినప్పుడు టబ్ నెమ్మదిగా తిరుగుతూ.. పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలిపోవటం గడిచిన కొన్నేళ్లుగా జరుగుతున్న తంతేనని.. ఆ విషయాన్ని అమెరికాకు చెందిన పలువురు బాధితులు వెల్లడించటం ఇప్పుడు సంచలనంగామారింది.

అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ముగ్గురు మహిళలతో పాటు.. ఇండియానా.. జార్జియాలకు చెందిన మరికొందరు సైతం శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలుతున్నాయన్న ఆరోపణలు చేస్తూ.. రక్షణ చర్యలు చేపట్టాలంటూ ఫెడరల్ కోర్టును ఆశ్రయించటం.. సదరు కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తుందని చెబుతున్నారు. శాంసంగ్ వాషింగ్ మెషీన్లో లోపాలు ఉన్నట్లుగా అమెరికా వస్తు వినియోగదారుల రక్షణ కమిషన్ చెప్పటంతో పాటు.. దాదాపు 11 మోడళ్లు ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే.. కంపెనీ మాత్రం తమ వాషింగ్ మెషీన్లు పేలిన ఘటనలు ఉన్నట్లుగా తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. కాకుంటే.. మోతాదుకు మించిన లోడ్ తో వాషింగ్ మెషీన్లను వేగంగా వినియోగించకూడదంటూ సదరు కంపెనీఅడ్వయిజరీ కమిటీలు చెప్పటం గమనార్హం. ఎందుకైనా మంచిది.. శాంసంగ్ వాషింగ్ మెషీన్లు వాడే వారు కాస్తంత జగ్రత్తగా ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. శాంసంగ్ టైం ఏమాత్రం బాగోలేనట్లుగా ఉంది.