Begin typing your search above and press return to search.

‘సైకిల్’తో హస్తానికి సవారీ లేనట్లేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2017 5:10 AM GMT
‘సైకిల్’తో హస్తానికి సవారీ లేనట్లేనా?
X
ప్రయత్నాలు కొలిక్కి రావటం లేదు. మోడీకి ముకుతాడు వేయాలన్న ఆలోచన ఆచరణ సాధ్యం కాకుండా మారింది. మొత్తంగా.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మహాకూటమితో మోడీ పరివారానికి దెబ్బేయాలన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటం లేదు. తమ పరిధిని.. బలాన్ని మర్చిపోయి.. సీట్ల విషయంలో రాజీ పడకపోవటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

ఇదే..ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఏర్పడటానికి అవరోధంగా మారింది. దీంతో.. ఆర్ ఎల్డీ.. జేడీయూలతో పాటు మరో పది చిన్న పార్టీలు కలిసి 403 స్థానాలకు పోటీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక.. కీలకమైన ఎస్పీ.. కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఎంతకూ తెగటం లేదు. మొత్తం 403 స్థానాల్లో వంద సీట్లు తమకు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. అఖిలేశ్ మాత్రం 85కు మించి సీట్లు ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలి మూడు దశలకు కలిపి.. 209 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో అధికార సమాజ్ వాదీ పార్టీ 191 స్థానాలకు తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో.. 18 స్థానాల్ని అట్టి పెట్టేసింది. మొత్తం స్థానాల్లో (403)లో సగంలోనే కాంగ్రెస్ కు కేటాయించిన స్థానాల సంఖ్య చూస్తే.. ఇప్పటివరకూ వినిపిస్తున్న వంద.. 85 స్థానాల మాట కూడా నిజం కాదన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు. అంతేకాదు.. తాము కాంగ్రెస్ కు కేటాయించిన స్థానాల విషయంపై తమ పార్టీ నేతలకు క్లారిటీ ఇస్తూ.. పొత్తు లేనిపక్షంలో తమ అభ్యర్థులతో జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ కు సొంత అడ్డా లాంటి అమేధీ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించలేమని ఎస్పీ స్పష్టం చేస్తున్న వేళ.. ఇరు పార్టీల మధ్య పొత్తు సాధ్యమయ్యే పనేనా? అన్న సందేహం కలుగుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమాజ్ వాదీ పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించిన తాజా జాబితాలో తొమ్మిది సీట్లు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు ఉండటం గమనార్హం. వీరిలో ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఉండటం చూస్తే.. హస్తంతో కలిసి సైకిల్ సవారీ లేనట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. జట్టుకట్టాలని అనుకున్న ఎస్పీ.. కాంగ్రెస్.. ఆర్ఎల్డీల మధ్య సీట్ల పంచాయితీ ఒక కొలిక్కి రాకపోవటంతో.. కలిసి పోటీ చేసే అవకాశం దాదాపుగా లేనట్లేనని చెప్పక తప్పదు.

వాస్తవానికి.. ఈ మూడు పార్టీలు కానీ జట్టు కడితే.. ఎన్నికల్లో ఈ కూటమికి విజయం పక్కా అన్న అంచనాలు ఉన్నాయి. ఈ వాదనకు తగ్గట్లే గణాంకాలు ఉండటం గమనార్హం. అదెలానంటే.. 2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 29.3 శాతం ఓట్లను (224 అసెంబ్లీ సీట్లు) సొంతం చేసుకుంది. 11.7 శాతం ఓట్లతో కాంగ్రెస్ (28 సీట్లు) పొందింది.ఈరెండు పార్టీలకు కలిపి 41 శాతం ఓట్లు వచ్చినట్లు. వీరికి జతగా కలవాలనుకున్న ఆర్ఎల్డీతో పక్కాగా పవర్ ను సొంతం చేసుకునే వీలుందన్న లెక్కలు ఉన్నాయి. అయితే.. పార్టీల మధ్య సీట్ల చిక్కుముడులు ఒక కొలిక్కి రాకపోవటం.. వీలైనన్నిఎక్కువ స్థానాలు తమకే ఉండాలన్న సమాజ్ వాదీ మొండితనం.. మహాకూటమి ఏర్పడకుండా అడ్డుకున్నాయన్న మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు.. మహా కూటమి తర్వాత.. సమాజ్ వాదీ.. కాంగ్రెస్ ల మధ్య కూడా పొత్తు కుదిరే అవకాశం లేనట్లేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/