Begin typing your search above and press return to search.

ముస్లింల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయి!

By:  Tupaki Desk   |   24 April 2018 1:46 PM GMT
ముస్లింల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయి!
X
కాంగ్రెస్ పార్టీ ఇర‌కాటంలో ప‌డే సంద‌ర్భం ఇది. ఆ పార్టీ తీరుపై సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి భ‌గ్గుమ‌న్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలను ఆ పార్టీకి వ్య‌తిరేకేస్తున్న ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్ తాజాగా ఆ పార్టీ అడ్డంగా బుక్ అయ్యే వ్యాఖ్య‌లు చేశారు. ఈ మధ్యే సీజేఐపై కాంగ్రెస్ తీసుకొచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఆయ‌న‌ వ్యతిరేకించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ముస్లింల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయంటూ తన సొంత పార్టీపైనే సల్మాన్ ఖుర్షీద్ సంచలన విమర్శలు గుప్పించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరిగిన ఓ ఈవెంట్‌ లో ఖుర్షీద్ ఈ కామెంట్స్ చేశారు. 1984లో సిక్కుల ఊచకోత - 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన ఘటనలపై ఆయన ఇలా స్పందించారు. ఈ రెండు ఘటనలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. ఈ ఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని - అలా అయితే చరిత్ర పునరావృతం కాకుండా ఉంటుందని ఆయన అన్నారు. `నేను కాంగ్రెస్‌ లో భాగం. మా చేతులకు ముస్లింల రక్తం అంటిందన్న నిజాన్ని అంగీకరించాల్సిందే. మా రక్తం అంటిన చేతులను మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కనీసం మీ చేతులకైనా ఆ రక్తం అంటకుండా చూసుకోండి` అని ఖుర్షీద్ అన్నారు.

ముస్లింలపై దాడులు - బాబ్రీ మసీదు విధ్వంసం.. హసన్‌ పురా - మలియానా - ముజఫర్‌ నగర్ అల్లర్లు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి.. మీ చేతులకు ముస్లింల రక్తం అంటింది కదా.. దీనిపై మీరేమంటారు అని ఈ యూనివర్సిటీ మాజీ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. `మైనార్టీలపై దాడులు చేస్తే మీ చేతులకూ రక్తపు మరకలు అంటుతాయి.మా చరిత్ర నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి. లేదంటే పదేళ్ల తర్వాత ఇలాగే నాలాంటి వ్యక్తి ఎవరో మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడగవచ్చు` అని ఆయన స్పష్టంచేశారు.

ఖుర్షీద్ వ్యాఖ్య‌లు ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. కాంగ్రెస్ నేత పీఎల్ పూనియా మీడియాతో మాట్లాడ‌తూ ఖుర్షీద్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. స్వాతంత్య్రానికి ముందైనా, తర్వాతైనా దేశంలోని అన్ని వర్గాలను కలుపుకుపోయిన ఏకైక పార్టీ తమదేనని అన్నారు. అయినా తన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోబోనని ఖుర్షీద్ స్పష్టంచేశారు. తానో మనిషిగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అన్నారు. `నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని కాను. నేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్‌ ను రక్షిస్తున్నది నేను. నేను చెప్పేది చెబుతూనే ఉంటా. నేనో మనిషిగా ఆ వ్యాఖ్యలు చేశాను` అని ఖుర్షీద్ స్పష్టంచేశారు.