Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు ఇంకోషాక్‌..బాబుతో సీనియ‌ర్ భేటీ

By:  Tupaki Desk   |   18 July 2018 1:42 PM GMT
కాంగ్రెస్‌ కు ఇంకోషాక్‌..బాబుతో సీనియ‌ర్ భేటీ
X
ఇప్ప‌టికే ఏపీలో కుదేల‌యిపోయిన కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపిన సంగ‌తి తెలిసిందే. ఉండ‌వ‌ల్లి టీడీపీలో చేరుతారా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వ‌గా..విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై చంద్రబాబుతో భేటీ అయ్యాన‌ని ఉండ‌వ‌ల్లి వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఇలా ఉండ‌గానే..మ‌రో సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి శైల‌జ‌నాథ్ చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యారు. అచ్చూ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి వ‌లే ఆయ‌న కూడా సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లి బాబుతో సుదీర్ఘ స‌మ‌యం భేటీ అయ్యారు. దీంతో పాటుగా స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావును క‌లిశారు.

కాంగ్రెస్ పార్టీకి భ‌విష్య‌త్ క‌నుమ‌రుగు అయిపోయింద‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ పార్టీ నేత‌లు త‌మ భ‌విష్య‌త్‌ ను వెతుక్కునేందుకు ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - పీసీసీ ఉపాధ్యక్షుడు అయిన‌ శైలజనాథ్ కూడా చేరార‌ని అంటున్నారు. తాజాగా సెక్రటేరియట్‌ లో ఆయ‌న సీఎం చంద్ర‌బాబును కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇప్ప‌టికే శైల‌జ‌నాథ్ స‌మ‌కాలీకులు అయిన నాయ‌కులు ఎవ‌రి దారి వారు చూసుకున్న నేప‌థ్యంలో...ఆయ‌న సైతం దారి చూసుకున్న‌ట్లు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై ఒంటికాలిపై లేచే శైల‌జ‌నాథ్ ఆయ‌న్ను క‌లిసేందుకు స్వ‌యంగా సెక్ర‌టేరియ‌ట్‌కు రావ‌డం, సుదీర్ఘ స‌మ‌యం భేటీ అవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. పైగా, స్పీక‌ర్‌ను కూడా క‌ల‌వ‌డం అనుమానాల‌కు కార‌ణంగా మారింది.

అయితే, దీనిపై శైల‌జ‌నాథ్ మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. సీఎం చంద్ర‌బాబుతో పాటు స్పీకర్‌ ను కూడా కలిశానని, తాను కలవడాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలియడం లేదని శైలజానాథ్ అన్నారు. సెక్రటేరియట్‌ కు టీడీపీ తప్ప మిగతా పార్టీల ప్రజాప్రతినిధులు వెళ్లకూడదా అని ఆయన ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీ మనిషిని - ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ మనిషిగానే ఉంటానని శైలజానాథ్ తెలిపారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశానని, ఈ సందర్భంగా సెక్రటేరియట్ ఎలా ఉందని సీఎం అడిగారన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని సీఎంకు తాను సూచించినట్లు శైలజానాథ్ తెలిపారు. స్పీక‌ర్‌ను క‌లిసిన స‌మ‌యంలో అన‌ర్హ‌త ఫిర్యాదు గురించి ప్ర‌స్తావించిన‌ట్లు వెల్ల‌డించారు.