Begin typing your search above and press return to search.

బాబుకు, హరీశ్ రావత్ కు లింకు పెట్టిన కాంగ్రెసోళ్లు

By:  Tupaki Desk   |   25 May 2016 10:34 AM GMT
బాబుకు, హరీశ్ రావత్ కు లింకు పెట్టిన కాంగ్రెసోళ్లు
X
ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పార్టీకి మిల్లీమీటరు కూడా మైలేజి రావడం లేదు.. దీంతో ప్రజల్లోకి వెళ్లినా ప్రయోజనం దక్కడం లేదన్న బాధో లేదంటే చంద్రబాబును విమర్శిస్తే పబ్లిసిటీ దక్కి ప్రజలు తమను గుర్తిస్తారన్న ఆలోచనో తెలియదు కానీ చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అరిగిపోయిన రికార్డులు, పొంతన లేని పోలికలతో నవ్వులపాలవుతున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేతలు చంద్రబాబును ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ తో పోలిక పెట్టారు.

ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఒక నీతి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు మరో నీతి అన్నట్లుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ తాజాగా విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి 'ఓటుకు కోట్లు' కేసులో చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదన్నారు. చంద్రబాబు కొనుగోలు బాగోతం ఆడియో టేపుల్లో రికార్డయింది.. అంతకంటే సాక్ష్యం ఏం కావాలో చెప్పాలన్నారు. విచారణల పేరుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కక్ష సాధిస్తోందని .. చంద్రబాబును మాత్రం విడిచిపెట్టేసిందని ఆరోపించారు. మిగతా నేతలు కూడా ఆయనతో గొంతు కలిపారు.

ఇంతకుముందు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా చంద్రబాబుపై ఇదే విషయంలో విమర్శలు చేశారు. అక్రమ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వంపై పోరాడాలని.. కావాలంటే కేసీఆర్ తో మాట్లాడి ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తాను తప్పిస్తానని అన్నారు. మరి కేసీఆర్ తో చెప్పి చంద్రబాబును కేసుల నుంచి తప్పించే సామర్థ్యం ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఆ పనేదో ప్రాజెక్టుల విషయంలోనే చేస్తే బెటర్ కదా అన్న సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్లు దారీ తెన్నూ లేని విమర్శలతో భలే నవ్వు తెప్పిస్తున్నాయి.