Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేత మాట‌..క‌శ్మీర్ భార‌త్‌ లో భాగం కాదు

By:  Tupaki Desk   |   23 Jun 2018 5:23 AM GMT
కాంగ్రెస్ నేత మాట‌..క‌శ్మీర్ భార‌త్‌ లో భాగం కాదు
X
నోట్ల ర‌ద్దు ఉదంతం - పెద్ద ఎత్తున డిపాజిట్లు అయిన బ్యాంకుల్లో బీజేపీ నేత‌లు డైరెక్ట‌ర్లుగా ఉన్న ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న బీజేపీకి...కాంగ్రెస్ పార్టీ త‌నంత తానుగా ఓ అస్త్రం అందించింది. `ఓ వ‌ర్గం` వారికి కాంగ్రెస్ అండ‌గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు చేస్తున్న బీజేపీకి స‌రిహ‌ద్దుల్లో ఉన్న జ‌మ్ముక‌శ్మీర్ విష‌యంలో కాంగ్రెస్ మ‌ళ్లీ దొరికిపోయింది. కశ్మీరీలు తమ స్వాతంత్య్రానికే తొలి ప్రాధాన్యతనిస్తారంటూ పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు ముషారఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. క‌శ్మీర్ వేర్పాటువాదుల‌కు కాంగ్రెస్ మ‌ద్దతు ఇస్తోంద‌నేందుకు ఇంత‌కంటే ఆధారం ఏం కావాల‌ని బీజేపీ దుయ్య‌బ‌ట్టింది. లౌకిక‌త్వం పేరు చెప్పే ఆ పార్టీదే నిజ‌మైన మ‌త ఎజెండా అని ఆరోపించింది.

``కశ్మీరీలకు తమ అభిప్రాయాల్ని వెల్లడించే స్వేచ్ఛను కల్పిస్తే స్వాతంత్య్రానికే వారు తొలి ప్రాధాన్యతనిస్తారని గతంలో ముషారఫ్ చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే. ఇది వాస్తవం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది (స్వాతంత్య్రం) సాధ్యం కాదని నాకు కూడా తెలుసు`` అని శుక్రవారం పేర్కొన్నారు.తాజాగా సోజ్ రాసిన కశ్మీర్: గ్లింప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ ద స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ అనే పుస్తకంలోనూ ఈ వివరాలున్నాయి. త్వరలో ఈ పుస్తకం విడుదల కానుంది.

మ‌రోవైపు సైఫుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గున మండిపడింది.``ఈ గడ్డపై ఉండాలంటే ఎవరైనా రాజ్యాంగానికి తప్పకుండా కట్టుబడి ఉండాలి. ఒకవేళ ముషారఫ్‌ ను అభిమానించే వాళ్లు ఇక్కడ ఉంటే.. పాక్‌కు వెళ్లేందుకు వారికి వన్‌వే టికెట్‌ ను అందజేస్తాం`` అని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. సోజ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ మండిపడ్డారు. సోజ్‌కు ముఫారఫ్‌ పై - పాక్‌ పై అభిమానం ఉంటే ఆ దేశానికి వెళ్లిపోయి అతడికి సేవకుడిగా మారాలని శివసేన నేత మనీషా కయాండే భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద విధానాలను అవలంభిస్తున్నదంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ విమర్శించారు. క‌శ్మీర్ విష‌యంలో అడ్డంగా బుక్ అయిపోయిన నేప‌థ్యంలో....సోజ్ వ్యాఖ్యలతో తమకు సంబంధంలేదని కాంగ్రెస్ ప్రకటించింది. తాను రాసిన పుస్తకాన్ని అమ్ముకునేందుకు సోజ్ ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడ్డారని కాంగ్రెస్ అధికారప్రతినిధి రణ్‌ దీప్ సూర్జేవాలా విమర్శించారు. భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగం అనేది ముమ్మాటికీ వాస్తవం. ఈ వాస్తవాన్ని మార్చ డం ఎవరి తరంకాదు. ఇంకా ప్రచురితం కాని ఓ పుస్తకంలో ఫలానా వ్యాఖ్యలు ఉన్నాయని సోజ్ చెప్తున్నది నిజమైతే దాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతి భారతీయ పౌరుడు ఖండిస్తారు అని అన్నారు. ఇదిలాఉండ‌గా.. సోజ్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 1991 ఫిబ్రవరిలో జేకేఎల్‌ ఎఫ్ మిలిటెంట్ సంస్థ ఆయన కూతురిని అపహరించ‌డం కొస‌మెరుపు.