గెటప్ అదుర్స్!..నాటకం పండలేదు!

Mon Feb 11 2019 14:17:59 GMT+0530 (IST)

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా చేస్తున్న సింగిల్ డే దీక్షలో లెక్కలేనన్ని సిత్రాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు... ఈ దీక్ష కోసం రాష్ట్ర ఖజానా నుంచి కోట్లు కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జాతీయ మీడియా అయితే ఈ దీక్షలకు బాబు ఏ మేర దుబారా చేస్తున్నారో - దీక్షకు వస్తున్న పార్టీ నేతలకు ఏ మేర లగ్జరీ వసతులు కల్పిస్తున్నారో... పక్కా ఆధారాలతో సహా ప్రత్యేక కథనాలు రాసి పారేశాయి. సరే పత్రికలు - మీడియాలో వచ్చే కథనాలను ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు...తన దీక్షను ప్రారంభించేశారు. ఈ దీక్షకు ఏపీ నుంచి 2500 మంది టీడీపీ నేతలు - కార్యకర్తలు ప్రత్యేక రైళ్లలో అక్కడికి తరలివెళ్లారు. ఈ బృందంలో ఇటీవలే తెరంగేట్రం చేసిన పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ కూడా ఉన్నారు.టీడీపీలో వేషాలేసే నేతగా ఇప్పటిదాకా చిత్తూరు ఎంపీ - సినీ నటుడు శివప్రసాద్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే శివప్రసాద్ ను తలదన్నేలా యామినీ... బాబు దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు తల్లి అవతారంలో అక్కడ ప్రత్యక్షమైన యామినీ... ఓ చేతిలో కలశాన్ని తలపించే మట్టి కుండ - మరో చేతిలో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందన్న కామెంట్లతో కూడిన ప్లకార్డును పట్టుకుని తనదైన శైలి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఈ సందర్భంగా తనను కదిలించిన ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన యామినీ.. చంద్రబాబు పోరాటాన్ని ఆకాశానికెత్తేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆమె ఏపీ ప్రజలందరినీ తన బిడ్డలని వ్యాఖ్యానించారు. చంద్రబాబును మాత్రం పెద్ద కొడుకుగా అభివర్ణించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్న కొడుకుగా - రెండో కుమారుడిగా పేర్కొన్నారు.

ఏపీ ప్రజలంతా కూడా తన బిడ్డలేనన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన యామినీ... వచ్చే ఎన్నికల్లో చిన్న కొడుకును ఓడించి పెద్ద కొడుకుకు మాత్రమే ఓటేయాలని కోరారు. చిన్ కొడుకు అన్యాయం చేస్తున్నాడని - పెద్ద కొడుకు మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరు సాగిస్తున్నారని కూడా తెలుగు తల్లి వేషధారణలోని యామినీ తనదైన శైలి కామెంట్లు చేశారు. అయినా ఏ తల్లి అయినా తన బిడ్డలపై భిన్న స్వరాలు వినిపిస్తుందా? ప‌్రత్యేకించి తెలుగు తల్లి ఓ బిడ్డను దీవించమని - ఇంకో బిడ్డను నాశనం చేయమని కోరుతుందా? అన్న అనుమానాలు రేకెత్తేలా యామినీ ఆసక్తికర ప్రసంగం చేశారు. మొత్తంగా గెటప్ తో ఓ మోస్తరులో జనం దృష్టిని ఆకర్షించినా... మాట తీరుతో ఆ వేషానికి తలవంపులు తెచ్చేలా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది.