రోడ్డుపై సచిన్ క్రికెట్.. వీడియో వైరల్

Tue Apr 17 2018 12:45:40 GMT+0530 (IST)

రెండున్నర దశాబ్దాల పాటు తన అసమాన క్రికెట్ నైపుణ్యంతో అభిమానుల్ని అలరించాడు సచిన్ టెండూల్కర్. అతను బ్యాట్ పట్టి క్రీజులోకి వస్తే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఐతే ఐదేళ్ల కిందట సచిన్ ఆటకు టాటా చెప్పేయడంతో అతడిని మళ్లీ క్రికెట్ మైదానంలో చూసే అవకాశం లేకపోయింది. అమెరికాలో నిర్వహించిన మాస్టర్స్ క్రికెట్ టోర్నీలో మాత్రమే సచిన్ తళుక్కుమన్నాడు. మళ్లీ అతను బ్యాట్ పట్టగా ఎవ్వరూ చూడలేదు. ఐతే తాజాగా సచిన్ మళ్లీ బ్యాట్ పట్టాడు. కొందరు కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడాడు. ఐతే అతను క్రికెట్ ఆడింది మైదానంలోకాదు. రోడ్డు మీద.



అవును.. నిజం. సచిన్ రోడ్డు మీద గల్లీ కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడాడు. ముంబయిలోని ఒక చోట రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా.. రాత్రి పూట కొందరు కుర్రాళ్లతో కలిసి సచిన్ క్రికెట్ ఆడాడు. ఆ రోడ్డును మూసేయడంతో అక్కడ ఆడేందుకు ఏ ఇబ్బందీ లేకపోయింది. రోడ్డు డివైడర్ గా ఉపయోగించే ప్లాస్టిక్ దిమ్మెనే సచిన్ బృందం వికెట్లుగా మార్చుకోవడం విశేషం. మరి సచిన్ ముందే ఇలా ప్లాన్ చేసి క్రికెట్ ఆడాడా.. లేక అనుకోకుండా ఆ మార్గంలో వెళ్తూ క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్లను చూసి వాళ్లతో జాయిన్ అయ్యాడా అన్నది తెలియదు. ఏదేమైనా సచిన్ లాంటి దిగ్గజ క్రికెటర్ ఇలా రాత్రి పూట రోడ్డుపై కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడటం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి