Begin typing your search above and press return to search.

సుప్రీం తీర్పు ఎఫెక్ట్‌: తీవ్ర ఉద్రిక్త‌త‌లో శ‌బ‌రిమ‌ల‌!

By:  Tupaki Desk   |   16 Oct 2018 2:59 PM GMT
సుప్రీం తీర్పు ఎఫెక్ట్‌:  తీవ్ర ఉద్రిక్త‌త‌లో శ‌బ‌రిమ‌ల‌!
X
ఇన్నేళ్లుగా భ‌క్తుల నినాదాల‌తో.. స్వామివారి కీర్త‌న‌ల‌తో ప్ర‌తిధ్వ‌నించిన శ‌బ‌రిమ‌ల ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని విధంగా..శ‌బ‌రిమ‌ల మొత్తం ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఎప్పుడూ అధ్యాత్మికం లేదంటే కాస్తంత వ్యాపారం జోరుగా క‌నిపించే చోట‌.. ఇప్పుడు అందుకు భిన్నంగా శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఇబ్బంది క‌లిగే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫ‌లితంగా చోటు చేసుకున్న ప‌రిణామంగా చెప్పాలి. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న ఆచార వ్య‌వ‌హారాలు.. న‌మ్మ‌కాలను ప‌క్క‌న పెట్టి.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల్ని అనుమ‌తిస్తూ సుప్రీంకోర్టు వెలువ‌రించిన తీర్పుపై అయ్య‌ప్ప భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అస్క‌లిత బ్ర‌హ్మ‌చారిగా కీర్తించే అయ్య‌ప్పను ద‌ర్శించుకోవ‌టానికి మ‌హిళ‌ల‌కు సంబంధించి కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. వీటిని స‌వాలు చేస్తూ కొంద‌రు సుప్రీంను ఆశ్ర‌యించ‌టం.. వారికి అనుకూలంగా సుప్రీం తీర్పునుఇవ్వ‌టం తెలిసిందే. నెల‌లో కొన్ని రోజుల పాటు మాత్ర‌మే తెరిచే అయ్య‌ప్ప దేవాల‌యాన్ని రేపు (బుధ‌వారం) తెర‌వ‌నున్నారు. సుప్రీం తీర్పును అమ‌లు చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కొంద‌రు మ‌హిళ‌లు (భ‌క్తులు అనొచ్చా?) శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప దేవాల‌యాన్ని సంద‌ర్శించాల‌ని భావిస్తున్నారు.

ఏళ్ల‌కు ఏళ్లుగా తాము న‌మ్మిన న‌మ్మ‌కాలు వ‌మ్ము అవుతున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో సుప్రీం తీర్పును వ్య‌తిరేకిస్తున్నారు. ఆల‌యం వైపు వెళుతున్న మ‌హిళ‌ల్ని అడ్డుకునేందుకు అయ్య‌ప్ప భ‌క్తులు అడ్డుకోవ‌టంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇదిలా ఉంటే.. అయ్య‌ప్ప ఆల‌యాన్ని సంద‌ర్శించే విష‌యంలో ఇప్ప‌టిదాకా అమ‌లైన నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించేలా వ్య‌వ‌హ‌రించిన వారిపై దాడులు చేసేందుకు సైతం వెనుకాడ‌మంటూ కొంద‌రు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. శ‌బ‌రిమ‌ల‌లోకి ప్ర‌వేశించే బ‌స్సులు.. ఇత‌ర వాహ‌నాల్లో మ‌హిళ‌ల కోసం గాలిస్తున్న అయ్య‌ప్ప భ‌క్తులు.. ఎవరైనా ఉంటే వారిని నిలువ‌రిస్తున్నారు.

శ‌బ‌రిమ‌ల ఆల‌య ద‌ర్శ‌నానికి వెళ్లేందుకు కీల‌క‌మైన పంబ వ‌ద్ద పెద్ద ఎత్తున అయ్య‌ప్ప భ‌క్తులు చేరుకొని మ‌హిళ‌లు వెళ్ల‌టాన్ని వ్య‌తిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేర‌ళ ప్ర‌భుత్వం మాత్రం సుప్రీం తీర్పును అమ‌లు చేస్తామ‌ని చెబుతోంది. శ‌బ‌రిమ‌ల‌లో అన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల్ని అనుమ‌తిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును పెద్ద ఎత్తున మ‌హిళ‌లు వ్య‌తిరేకించ‌టం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితిని చూసిన‌ప్పుడు క‌లిగే భావ‌న ఒక్క‌టే. దేవుడిపై న‌మ్మ‌కం ఉన్న వారి మ‌నోభావాల్ని దెబ్బ‌తీసేలా.. కొంద‌రి ఇష్టాల‌కు అధిక ప్రాధాన్య‌త ఎందుకు ఇవ్వాల‌న్న ప్ర‌శ్న క‌లుగ‌క మాన‌దు. నిజంగా అయ్య‌ను అంత‌గా ఆరాధించే వారే అయితే.. ఆ క్షేత్రానికి ఉన్న న‌మ్మ‌కాల్ని గౌర‌వించాలి క‌దా? చూస్తుంటే.. అయ్య‌ప్ప మీద భ‌క్తి కంటే కూడా అక్క‌డి న‌మ్మ‌కాల‌ను స‌వాలు చేసేందుకు ఎక్కువ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గుప్పెడు మంది కోసం కోట్లాది మంది న‌మ్మ‌కాల‌ను దెబ్బ తీస్తే క‌లిగే లాభం ఏమిటి..?