Begin typing your search above and press return to search.

రేవంత్ అరెస్టుతో వికారాబాద్ ఎస్పీ పై వేటు!

By:  Tupaki Desk   |   5 Dec 2018 9:07 AM GMT
రేవంత్ అరెస్టుతో వికారాబాద్ ఎస్పీ పై వేటు!
X
కాంగ్రెస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అరెస్టుతో కొడంగ‌ల్‌లో మంగ‌ళ‌వారం తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకున్న హైకోర్టు రేవంత్ విడుద‌ల‌కు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో బ్రిటిష్ పాల‌న కాలం నాటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజాగా రేవంత్ అరెస్టుకు సంబంధించి మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.

రేవంత్ అరెస్టుకు ఆదేశాలిచ్చిన వికారాబాద్ జిల్లా ఎస్పీ టి.అన్న‌పూర్ణ‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ వేటు వేసింది. ఆమె స్థానంలో 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మ‌హంతిని వెంట‌నే వికారాబాద్ ఎస్పీగా నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజేశ్వ‌రిని ఎక్క‌డా ఎన్నిక‌ల విధుల్లో నియ‌మించ‌కూడ‌ద‌ని, ఆమెను పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యానికి అటాచ్ చేయాల‌ని డీజీపీకి ఆదేశాలిచ్చింది. కొడంగ‌ల్‌లో మంగ‌ళ‌వారం నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు - హైకోర్టు ఆగ్ర‌హాన్ని ఈసీ ఎంత సీరియ‌స్‌గా తీసుకుందో తాజా చ‌ర్య‌తో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. భార్య, కుమార్తెతో క‌లిసి ఇంట్లో ఆయ‌న నిద్రిస్తుండ‌గా.. త‌లుపులు బ‌ద్ద‌లుకొట్టి మ‌రీ పోలీసులు లోప‌లికెళ్ల‌లారు. వారెంట్ చూపించ‌కుండానే అరెస్టు చేశారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆయన్ను ఎక్క‌డ ఉంచారో కూడా బ‌య‌ట‌పెట్ట‌లేదు. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌న భ‌ర్త ఏం త‌ప్పు చేశాడ‌ని అలా అర్ధ‌రాత్రి ఇంటికొచ్చి ఈడ్చుకెళ్లారో చెప్పాలంటూ రేవంత్ భార్య గీతారెడ్డి ఎస్పీ అన్న‌పూర్ణ‌ను న‌డిరోడ్డు మీద నిల‌దీశారు. దీంతో స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌మిలిన ఎస్పీ.. ఏదైనా ఉంటే త‌న‌కు రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేయాలంటూ అక్క‌ణ్నుంచి వెళ్లిపోయారు. అనంత‌రం కొడంగ‌ల్ వ్యాప్తంగా రేవంత్ మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న‌ల‌కు దిగారు. ఈ నేప‌థ్యంలోనే ఎస్పీపై వేటుప‌డిన‌ట్లు తెలుస్తోంది.