డ్రగ్స్ కేసులో ఆ ఇద్దరు సినీ ప్రముఖులు బుక్?

Wed Aug 09 2017 10:43:47 GMT+0530 (IST)

కొద్దికాలం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ మధ్యన ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. 12 మంది సినీ ప్రముఖులతో పాటు.. పలువురు అనుమానితులపైనా సిట్ అధికారులు దృష్టి సారించి విచారించిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖుల విచారణ తర్వాత ఈ కేసు విషయం మీద పెద్దగా అప్డేట్స్ బయలకు రాని పరిస్థితి. ఇదిలా ఉండగా ఒక కొత్త అంశం తెర మీదకు వచ్చింది.

డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న 12 మంది సినీ ప్రముఖుల్లో ఇద్దరు దాదాపుగా దొరికినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఈ ఇద్దరికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు వెల్లడైనట్లుగా చెబుతున్నారు.

సినీ ప్రముఖులతో పాటు.. పలువురి అనుమానితుల్ని విచారించిన సిట్ అధికారులు.. తమ విచారణ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇద్దరి పేర్లను కామన్ గా చెప్పినట్లుగా తెలుస్తోంది. తమ విచారణలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు చాలానే పేర్లు చెప్పినా..అందరి మాటల్లోనూ ఇద్దరి ప్రస్తావన మాత్రం ఒకేలా వచ్చిందన్నట్లుగా సమాచారం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక సినీ ప్రముఖుడైతే తన విచారణలో ఏకంగా 53 మంది డ్రగ్స్ వాడుతున్న వారి పేర్లు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తమ విచారణలో వెల్లడించిన వివరాలకు సంబంధించి దాదాపుగా 60 గంటల వీడియో ఫుటేజ్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.

సినీ ప్రముఖులంతా కామన్ గా చెప్పిన ఇద్దరు ప్రముఖులపైన పట్టుబిగించేలా చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మత్తుమందులు రవాణా చేయటం.. వాడటం రెండూ నేరమేనని.. వాడుతున్న నిరూపణ అయితే అరెస్ట్ చేయటానికి అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులు చెబుతున్నారు.

సిట్ విచారించిన 12 మంది సినీ ప్రముఖుల్లో ఇద్దరి మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని.. వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. అవసరమైతే కేసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. విచారణ సందర్భంగా కొందరు తమ గోళ్లు.. రక్త నమూనాలు.. వెంట్రుకలు ఇవ్వని నేపథ్యంలో.. కోర్టును ఆశ్రయించి.. శాంపిల్స్ సేకరించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తమ్మీదా కొంతకాలంగా కామ్ గా ఉన్నట్లు కనిపించిన డ్రగ్స్ విచారణ కేసు రానున్న కొద్దిరోజుల్లో మరోసారి సంచలనంగా మారి.. తెర మీదకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.