అదివ్వాలంటూ రచ్చ చేస్తున్న కెల్విన్

Mon Jul 17 2017 10:34:46 GMT+0530 (IST)

డ్రగ్స్ రాకెట్‌కు మూలమైన కెల్విన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించటమే కాదు.. టాలీవుడ్ తో పాటు రాజకీయ.. పారిశ్రామిక వర్గాల్ని షేక్ చేస్తున్న డ్రగ్స్ ఉదంతంలో కీలకమైన కెల్విన్ ఇప్పుడు విచారణ అధికారుల అదుపులో ఉండటం తెలిసిందే.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడు?

పోలీసులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? డ‌్రగ్స్ కోసం పలువురిని ఇష్టం వచ్చినట్లుగా తిప్పించుకున్న అతగాడు ఇప్పుడేం చేస్తున్నాడు?తాను ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తుందంటూ ఒక మాజీ హీరోయిన్ గురించి చెప్పి పోలీసులకు షాకిచ్చిన అతగాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? డ‌్రగ్స్‌ను అమ్మటమే కాదు.. అదే డ్రగ్స్‌కు బానిస అయిన కెల్విన్ డ్రగ్స్ లేకుండా ఎలా ఉంటున్నాడు? లాంటి ఆసక్తికర ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభిస్తోంది.

ఉన్నతాధికారులు అందిస్తున్న సమాచారం ప్రకారం.. విచారణలో ఉన్న కెల్విన్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని చెబుతున్నారు. డ్రగ్స్‌కు బానిస అయిన అతడు.. తనకు కొద్దిమొత్తంలో డ్రగ్స్ కావాలని విపరీతంగా కోరుకుంటున్నాడట. వారం రోజులుగా డ్రగ్స్‌ను తీసుకోని నేపథ్యంలో పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడట. మత్తు కోసం ఎంతోమందిని తన చుట్టూ తిప్పించుకొని.. వారితో అడ్డమైన పనులు చేయించిన కెల్విన్.. అదే మత్తు కోసం పోలీసుల కాళ్లావేళ్లా పడుతున్నాడట. డ్రగ్స్ అందని నేపథ్యంలో విపరీతమైన బాధకు గురి అవుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు.

అదే సమయంలో బిర్యానీ కావాలి.. సిగిరెట్లు కావాలంటూ గొంతెమ్మ కోర్కెల్ని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.  ఇదంతా ఒక ఎత్తు అయితే.. త్వరలోనే తాను విడుదల అవుతానని.. చట్టం తనను ఏమీ చేయలేదని.. బయటకు వెళ్లాక మళ్లీ తన దందా కొనసాగిస్తానని చెబుతున్నాడట. ఇందుకు ఉదాహరణగా తాను 2013లో ఒకసారి అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చానని.. ఇప్పుడు కూడా తనకేమీ కాదన్న ధీమాలో అతగాడు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు కెల్విన్ లాంటోళ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.