విచారణలో కెల్విన్ చెప్పింది ఇదేనా?

Sun Jul 16 2017 12:53:36 GMT+0530 (IST)

డ్రగ్స్ కేసు అంతకంతకూ తీవ్రమవుతుందా? అన్ని కేసుల మాదిరి కాకుండా.. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని పరిణామాలకు తెర తీయనుందా? డ‌్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్.. విచారణ అధికారులకు ఏం చెప్పాడు? అందుకు సంబంధించిన సాక్ష్యాల సేకరణ విషయంలో పోలీసులు ఎంతమేర పురోగతి సాధించారన్నవి ఇప్పుడు ప్రధాన ప్రశ్నలు అయ్యాయి.

అయితే.. వీటన్నింటికి కెల్విన్ ఇచ్చిన సమాచారమే కీలకంగా మారిందని చెప్పక తప్పదు. వివిధ మీడియా కథనాల్లో  ప్రస్తావిస్తున్న అంశాల ప్రకారం చూస్తే.. పలు సంచలన విషయాల్ని.. కేసుకు కీలకంగా మారే అంశాల్ని విచారణలో భాగంగా కెల్విన్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇంతకీ..కెల్విన్ చెప్పినట్లుగా పలు మీడియా కథనాల్లో వచ్చిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే.. కెల్విన్ చెప్పినట్లుగా మీడియాలో వచ్చిన విషయాలేవీ అధికారికంగా కాకపోవటం గమనార్హం. అన్ని కూడా తెలిసింది.. సమాచారం.. తెలుస్తోందన్న మాటల్ని వాడిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇంతకీ.. కెల్విన్ చెప్పినట్లుగా వచ్చిన వార్తల్లోని అంశాల్ని చూస్తే..

= డ్రగ్స్ ఉదంతంలో చిత్రపరిశ్రమకు సంబంధించి ఇప్పటికే వెల్లడించిన 12 పేర్లకు అదనంగా సినీ రంగానికి చెందిన మరో 15 పేర్లను కూడా కెల్విన్ చెప్పాడు. అందులో ఒక పెద్ద నిర్మాత పేరు కూడా ఉంది. వారితో పాటు పలువురు రాజకీయ నాయకుల పిల్లల గురించి కూడా చెప్పాడు.

= కొందరు అమ్మాయిలు డ్రగ్స్ కోసం తమ నగ్న చిత్రాల్ని.. వీడియోల్ని కూడా కెల్విన్ కు పంపారు(?)

= తాను డ్రగ్స్ ను ఎలా తీసుకొచ్చేది.. ఎలా సరఫరా చేసేది.. వారితో తనకు ఎలాంటి పరిచయం ఉందన్నది వెల్లడించాడు. డ్రగ్స్ సరఫరాకు డేనియల్ అనే వ్యక్తిని తాను వాడుకునేవాడినని కెల్విన్ చెప్పాడు (?)

= డ్రగ్స్ కు అలవాటు పడిన అమ్మాయిలు వాటి కోసం తమకు వారి నగ్న చిత్రాల్ని పంపేవారని చెప్పినప్పుడు అధికారులు షాక్ తిన్నారు(?)

= డ్రగ్స్ మత్తులో తాను కొన్నిసార్లు గంటల తరబడి ఉండిపోయేవాడినని.. డోస్ ఎక్కువైతే అలానే మత్తులో ఉండిపోయేవాడినని.. ఆ టైంలో నవ్వటం.. ఏడవటం.. ఏం చేసేదీ అస్సలు తెలిసేది కాదని చెప్పాడు

= రైడింగ్.. గిటార్ వాయించటం లాంటి అలవాట్లు ఉన్నట్లుగా చెప్పిన కెల్విన్.. ఆయా ప్రాంతాల్లో సినీ ప్రముఖుల్ని కలిసేవాడినని.. ఒకరి ద్వారా మరొకరితో అనుబంధాన్ని పెంచుకొన్నట్లుగా చెప్పాడు. డ్రగ్స్‌కు ఒక్కసారి అలవాటు పడితే వారే తన వెంట పడతారని.. ఇలా ఒకరి ద్వారా మరొకరు పరిచయమై దాదాపు 28 మంది టాలీవుడ్ వారికి డ్రగ్స్ ఇచ్చేవాడినని చెప్పాడు.

= కెల్విన్ ఫోన్లో నటీనటుల పేర్లతో నెంబర్లు సేవ్ చేసుకున్నప్పటికీ..ఇద్దరు డ్రైవర్లు.. మరో ఇద్దరు పర్సనల్ మేనేజర్లు తనను ఫోన్లో సంప్రదించినట్లుగా చెప్పాడు.

= విచారణలో కెల్విన్ చెప్పిన సమాచారం నేపథ్యంలో అతడి ఫోన్ ఈ కేసుకు కీలకం కానుంది. ఇందుకోసం అతను డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు షురూ చేశారు.

= తాజాగా కెల్విన్ చెప్పిన 15 మంది పేర్లలో చిన్న చిన్న వేషాలతో సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఒకేసారి పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఒక నిర్మాత.. ముగ్గురు.. నలుగురుచిన్నా చితకా నటులు.. పలు విభాగాలకు చెందిన వారి పేర్లు చెప్పాడు.

= కెల్విన్ చెప్పిన సమాచారంతోనే నోటీసులు..కేసులు పెట్టేయలేమని.. ఎందుకంటే.. వాటికి సంబంధించిన ఆధారాలు చాలా కీలకమని.. అందుకే.. కెల్విన్ చెప్పిన మాటలకు తగిన ఆధారాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

= సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ దర్శకుడు.. అతని శిష్యురాలు మాత్రం నేరుగా డ్రగ్స్ కోసం సంప్రదించే వారని విచారణలో చెప్పాడు(?)

= డ్రగ్స్ సరఫరా కోసం ప్రత్యేక వాట్సప్ గ్రూపుల్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పెట్టేవాడు. పబ్బులు..బార్ లలోనే డ్రగ్స్ ను డెలివరీ చేసేవాడినని చెప్పాడు (?)

= కెల్విన్ కొత్తగా చెప్పిన డేనియల్ ను గుర్తించేందుకు.. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.