Begin typing your search above and press return to search.

కేర‌ళ‌లో బీజేపీకి ఇక క‌ష్ట‌కాల‌మేనా?

By:  Tupaki Desk   |   18 March 2017 9:08 AM GMT
కేర‌ళ‌లో బీజేపీకి ఇక క‌ష్ట‌కాల‌మేనా?
X
నిజ‌మే... పిన‌ర‌యి విజ‌యన్ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తర్వాత కేర‌ళ‌లో బీజేపీకి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు - ముగ్గురు బీజేపీ అనుబంధ సంఘాల‌కు చెందిన కీల‌క నేత‌లు కేర‌ళలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో సీపీఎం నేతృత్వంలోని కూట‌మి విజ‌యం సాధించ‌గా, ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ పిన‌ర‌యి విజ‌య‌న్ సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. విజ‌య‌న్ సీఎం కుర్చీలో కూర్చున్న మ‌రుక్ష‌ణ‌మే సీపీఎం అనుబంధ సంఘాలకు ఒక్క‌సారిగా బ‌లం వ‌చ్చేసిన‌ట్లుగా ఫీల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే హిందూత్వ వాదంతో ముందుకెళుతున్న బీజేపీ, దాని అనుబంధ విభాగాల‌పై ఆ రాష్ట్రంలో వ‌రుస‌గా దాడులు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా వెలుగుచూసిన ఘ‌ట‌న‌లో సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ ఎఫ్ ఐ... బీజేపీ స్టూడెంట్ వింగ్ అయిన ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లను చిత‌క‌బాదింది. త్రిసూర్‌ లోని ఓ కళాశాల‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో ఏబీవీపీకి చెందిన దాదాపు 15 మందికి పైగా ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... త్రిసూర్‌ లోని వ‌ర్మ క‌ళాశాల‌కు మంచి పేరే ఉంది. ఆ పేరుకు త‌గ్గ‌ట్టుగానే క‌ళాశాల‌లో ఏబీవీపీతో పాటు ఎస్ ఎఫ్ ఐ త‌దిత‌ర విద్యార్థి సంఘాలు కూడా క్రియాశీల‌కంగానే ప‌నిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య సైద్ధాంతిక వైరుద్ధ్యం ఆది నుంని కొన‌సాగుతూ వ‌స్తున్నా... తాజా గొడ‌వ‌ల‌కు మాత్రం పెద్ద‌గా కార‌ణాలేమీ లేవు.

మొన్న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్న ఓ చిన్న వివాదం... ఆ త‌ర్వాత చిలికి చిలికి గాలి వాన‌లా మారిపోయింది. త‌ర‌చూ దాడులు చేసుకునే దాకా కూడా వెళ్లింది. నిన్న ఏకంగా ప‌దుల సంఖ్య‌లో ఇరు వైపులా మోహ‌రించిన రెండు వ‌ర్గాలు ఒకరిపై మ‌రొక‌రు దాడులు చేసుకున్నారు. అయితే పిన‌ర‌యి స‌ర్కారు ద‌న్ను ఉంద‌న్న భావ‌న‌తో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మ‌రింత‌గా రెచ్చిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే విష‌యాన్ని కాస్తంత లేటుగా అవ‌గ‌తం చేసుకున్న ఏబీవీపీ విద్యార్థులు అక్క‌డి నుంచి త‌ప్పించుకునే య‌త్నం చేసేలోగానే ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులు మూకుమ్మ‌డి దాడి చేశారు. ఈ దాడిలో 15 మందికి పైగా ఏబీవీపీ విద్యార్థుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ త‌ర‌హా ప‌రిణామాల‌పై ప్ర‌భుత్వం ఇంకా మౌనం పాటిస్తే... రానున్న కాలంలో ప‌రిస్థితి మ‌రింత విష‌మించే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఆ వాద‌న‌ను పిన‌ర‌యి చెవిన వేసుకుంటారో? లేదో? చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/