కేంద్రం షాకిచ్చే కామెంట్ చేసిన సుప్రీంకోర్టు

Wed Jan 11 2017 11:38:45 GMT+0530 (IST)

కేంద్రంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించింది. ఒకపక్క కేసుల పెండింగ్ కోట్లలో నిలిచిపోయిందన్న ఆందోళన పెరుగుతూ.. సకాలంలో న్యాయం అందటం ఆలస్యమవుతుందన్న మాట వినిపిస్తున్న వేళ అందుకు పరిష్కార మార్గాల దిశగా అడుగులు వేయాల్సిన కేంద్రం.. అలాంటి చర్యలేమీ చేపట్టటం లేదన్న విమర్శ వినిపించటం తెలిసిందే. కేంద్రం తీరుపైన సీనియర్ న్యాయమూర్తులు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కి సంచలనం సృష్టించారు కూడా.

అయినప్పటికీ కేంద్ర సర్కారు తీరులో మార్పు లేదనే చెప్పాలి. పెండింగ్ కేసుల పరిష్కారానికి చేయూత ఇవ్వకున్నా ఫర్లేదు.. తరచూ వాయిదాలు కోరుతున్న కేంద్రంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ఏళ్ల కొద్ది క్లియర్ కాని ముఖ్యమైన కేసుల్లో వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్న కేంద్రం తీరును తప్పు పట్టింది. ప్రతి అంశంలోనూ వాయిదా కోరటం ఏమిటంటూ ప్రశ్నించింది.

వాయిదాలు అడుగుతూ.. విచారణ కాలాన్ని పొగిడించేలా చేస్తున్న కేంద్రం వైఖరికి చెక్ పెట్టాలన్నట్లుగా సుప్రీం వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇకపై.. కేసుల వాయిదాల్ని కోరిన పక్షంలో ప్రతి వాయిదాకు భారీ ఖర్చుల్ని మోపుతామని సుప్రీం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కేంద్రం తీసుకున్న మరో నిర్ణయాన్ని సుప్రీం తీవ్రంగా స్పందించటమే కాదు వ్యతిరేకించింది కూడా. అత్యున్నత న్యాయస్థానం గౌరవాన్ని.. హోదాను కించపరచటమేనన్న వ్యాఖ్యల్ని చేసింది. సుప్రీం నోటి నుంచి ఇంత తీవ్రవ్యాఖ్యలు రావటానికి కారణం.. సుప్రీంకు స్పందించే బాధ్యతల్ని ప్రభుత్వం అండర్ సెక్రటరీ స్థాయికి అప్పగించటమే.

సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసే ప్రమాణ పత్రాలు.. ప్రతిస్పందనల్ని అఖిల భారత సర్వీసులకు చెందిన సంయుక్త కార్యదర్శి కన్నాతక్కువ స్థాయి అధికారికి అప్పగించకూడదని తేల్చి చెప్పటమే కాదు.. ఇందుకు సంబంధించిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థను తనతో కలుపుకెళ్లాల్సిన కేంద్రం.. న్యాయవిభాగం తరచూ ఆగ్రహం చెందేలా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/