Begin typing your search above and press return to search.

కశ్మీరీల విషయంలో చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   16 Sep 2019 10:52 AM GMT
కశ్మీరీల విషయంలో చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం
X
జమ్మూకశ్మీర్ ను విభజించి నేటికి నెలన్నర కావస్తోంది. ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకశ్మీర్ ను విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్రం జమ్మూకశ్మీర్ లో సైన్యాన్ని మోహరించి ఆంక్షల వలయంలో బంధీ చేసింది. విభజన - ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీరీలు ఏమనుకుంటున్నారా కూడా ప్రపంచానికి తెలియకుండా పోయింది. రాష్ట్రంలో జాతీయ - అంతర్జాతీయ మీడియాకు ప్రవేశం లేకుండా చేశారు. ఫోన్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక రాజకీయ నేతలు కూడా కశ్మీర్ వెళ్లకుండా సైన్యం అడ్డుకుంది. వారిని నిర్బంధించి పంపించారు.

అయితే స్వయంగా కశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్లు కూడా తన సొంతరాష్ట్రం వెళ్లని పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ కల్పించింది. ఆయన కుటుంబ సభ్యులు - బంధువులు కూడా ఎలా ఉన్నారో తెలుసుకోకుండా పోయింది. దీంతో ఆయనతోపాటు చాలా మంది కశ్మీర్ కు వెళ్లడానికి అక్కడి ప్రజల బాధలు తెలుసుకోవడానికి అనుమతిని ఇవ్వాలని సుప్రీం కోర్టు గడప తొక్కారు.

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వేసిన పిటీషన్ ను తాజాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ విచారించి ఆయన కశ్మీర్ కు వెళ్లి నాలుగు జిల్లాల్లో పర్యటించడానికి అనుమతించారు. అంతేకాదు.. అక్కడి పరిస్థితులపై సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు.

బారాముల్లా - శ్రీనగర్ - అనంత్ నాగ్ - జమ్మూలోని ప్రజలతో మాట్లాడి వారి సంక్షేమం - రాష్ట్ర విభజనపై మనోభావాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని ఆజాద్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించారు. అవసరమైతే తాను కూడా స్వయంగా శ్రీనగర్ లో పర్యటిస్తానని చీఫ్ జస్టిస్ రంజన్ అనడం రాజకీయంగా సంచలనంగా మారింది.

కోర్టులలో కశ్మీరీల బాధను - గోసను చెప్పుకోవడానికి ఇప్పటికీ అనుమతి లేకపోవడాన్ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సీరియస్ గా పరిగణించారు. అందుకే స్వయంగా తాను వెళతానని.. ఆజాద్ ను కూడా వారి వాయిస్ వినిపించాలని ఆదేశించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కశ్మీర్ ను ఇన్నాళ్లు నిర్బంధించిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు సుప్రీం తీర్పును శిరసావహిస్తుందా? ఆజాద్ ను పంపిస్తుందా? చీఫ్ జస్టిస్ ను సైతం పర్యటించడానికి అవకాశం కల్పిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.