Begin typing your search above and press return to search.

తాజ్ వ‌క్ఫ్ ఆస్తి ఎలా అవుద్ది..షాజ‌హాన్ సంత‌కం తేండి

By:  Tupaki Desk   |   12 April 2018 8:06 AM GMT
తాజ్ వ‌క్ఫ్ ఆస్తి ఎలా అవుద్ది..షాజ‌హాన్ సంత‌కం తేండి
X
ప్రేమ సౌదం తాజ్‌ మ‌హ‌ల్ అనూహ్య వార్త‌ల‌తో తెర‌మీద‌కు ఎక్కింది. ఓవైపు కోర్టు తీర్పు మ‌రోవైపు భారీ వ‌ర్షాల‌తో ఓ పిల్ల‌ర్ కూల‌డం క‌ల‌కలంగా మారింది. తాజ్‌ మహల్‌ కు తామే యజమానులం అని ప్రకటించాలన్న ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్‌ బోర్డును.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ సంతకాలు చేసిన దస్ర్తాలు సమర్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వారంలోగా దస్ర్తాలతో హాజరుకావాలని పేర్కొంది. భార్య ముంతాజ్‌ మహల్‌ పై ప్రేమతో తాజ్‌ మహల్ కట్టించిన తర్వాత.. 18 ఏండ్లకు ఆగ్రా కోటలో గృహనిర్బంధంలో ఉండగానే షాజహాన్ కన్నుమూశారు.

తాజ్‌ మహల్ తమ ఆస్తి అని 2005 జూలైలో వక్ఫ్‌ బోర్డు ప్రకటించుకోగా, దీన్ని వ్యతిరేకిస్తూ భారత పురావస్తుశాఖ (ఏఎస్ ఐ) 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ పై వాదనల సందర్భంగా చీఫ్‌ జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ..`తాజ్‌ మహల్ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందంటే ఎవరైనా నమ్ముతారా? షాజహాన్ వక్ఫ్‌ నామాపై ఎలా సంతకం చేశారు? దాన్ని మీకెప్పుడు ఇచ్చారు? అని ప్రశ్నించారు. మొఘల్ చక్రవర్తి నాటి కాలంలో వక్ఫ్‌ నామా అనేది కూడా లేదు` అని ఏఎస్ ఐ తరఫు న్యాయవాది ఏడీఎన్‌రావు చెప్పారు. షాజహాన్‌ ను ఆయన కుమారుడు ఔరంగజేబ్ నిర్బంధించారు. ఆ నిర్బం ధంలోనే ఆయన మృతిచెందారు. మరి కస్టడీలో ఉండగా వక్ఫ్‌ నామాపై ఎలా సంతకం చేశారు? అని ధర్మాసనం ఆదేశించింది.

మ‌రోవైపు భారీ వర్షాలు ఉత్తరాదిలో హోరెత్తిస్తున్నాయి. యూపీలో బుధవారం కుండపోత వాన కురిసింది. ఆ వర్షం ధాటికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌ మహల్ ఆవరణలో ఉన్న ఓ పిల్లర్ కూలింది. ఎంట్రీ గేటు వద్ద ఉన్న పిలర్ జోరు వానకు ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. మథురా జిల్లాలోని ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ ఓ గ్రామంలో వర్షం వల్ల ఇళ్లు కప్పు కూలింది. ఆ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. నందగావ్ - వృందావన్ - కోసి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.