ఎన్టీఆర్ ఆత్మ క్షోభించే పనిచేశావు బాబు

Fri Aug 10 2018 23:42:07 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై బీజేపీ మండిపడింది. చంద్రబాబు తీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా ఉందని వ్యాఖ్యానించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టీడీపీ ఓటు వేయడంపై  ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీని వ్యక్తులు నడిపిస్తున్నారా? వ్యవస్థ నడిపిస్తుందా? అర్థం కావడం లేదని అన్నారు. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఢిల్లీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా ఏపీపై కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు.



ఏపీని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపిందని విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్-టీడీపీ రెండు ఒక్కటేనని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ తగిలించుకున్న ముసుగు తొలిగిపోయిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ఏపీ అభివృద్ధి గురించి టీడీపీ మాట్లాడితే ఆత్మవంచన చేసుకోవడం గురించి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగడంపై ఎన్టీఆర్ ఆత్మ క్షోభించదా అని బీజేపీ నేత ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ లో టీడీపీలో విలీనం చేసి పోటీ చేస్తారా టీడీపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్-టీడీపీ కూటమి ద్రోహుల కూటమి మాత్రమేనని ఆరోపించారు.

ఏపీ అభివృద్ధిపై తెలుగుదేశం మొసలి కన్నీరు కారుస్తోందని విష్ణువర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ద్వారానే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. రాయలసీమలో హైకోర్ట్ ఏర్పాటుచేయకపోతే టీడీపీ నేతలు ద్రోహులని ఊరు ఊరునా ప్రచారం చేసి చెప్తామన్నారు. ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా వైపల్యం చెందిందని టీడీపీ ఏపీలో మునిగిపోయే నావ అని విష్ణువర్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలని చూస్తోందని అన్నారు.