Begin typing your search above and press return to search.

అమెరికా-ర‌ష్యా ఎత్తుల‌కు మీడియా బ‌లి

By:  Tupaki Desk   |   19 March 2017 8:45 AM GMT
అమెరికా-ర‌ష్యా ఎత్తుల‌కు మీడియా బ‌లి
X
అగ్ర‌రాజ్యం అమెరికా - ఆ దేశానికి స‌మాన స్థాయిలో ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్న ర‌ష్యా మ‌ధ్య సాగుతున్న ఎత్తులు పై ఎత్తుల ప‌ర్వంలో మీడియా బ‌లి అవుతోంది. ఏకంగా ఒక దేశ చ‌ట్ట‌స‌భ‌లో మ‌రో దేశానికి చెందిన మీడియా సంస్థ‌పై ద‌ర్యాప్తుకు ఆదేశించే స్థాయికి ప‌రిస్థితి చేరింది. అమెరికాకు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ సీఎన్‌ ఎన్‌ (కేబుల్‌ న్యూస్‌ నెట్‌ వర్క్‌) ప్రసారాలపై దర్యాప్తు చేపడతామని రష్యా డ్యుమా (దిగువ సభ) వెల్లడించింది. రష్యాలో సీఎన్‌ ఎన్‌ కార్యాలయం ఉంది. రష్యా మీడియా చట్టాలను తుంగలో తొక్కి సీఎన్‌ఎన్‌ ప్రసారాలు నిర్వహిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ప్రసారాలపై దర్యాప్తునకు డ్యుమా అంగీకరించింది. దర్యాప్తు బాధ్యతలను ఐపీటీసీ ( ఇన్‌ఫర్మేషన్‌ పాలసీ, టెక్నాలజీస్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ) కమిటికి అప్పగించినట్టు పేర్కొంది. ప్రో క్రెమ్లిన్‌ యునైటెడ్‌ రష్యా పార్టీ ఎంపీ కోన్‌స్టాన్‌టిన్‌ జతులిన్‌ సీఎన్‌ ఎన్‌ పై దర్యాప్తు చేపట్టాలనే ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టగా దానికి మెజారిటీ పార్లమెంట్‌ సభ్యులు మద్దతు తెలిపారు.

కాగా, రష్యా స్టేట్‌ మీడియా రష్యాటుడే నిర్వహిస్తున్న ప్రసారాలపై దర్యాప్తు చేపట్టాలని అమెరికా డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ జీన్‌ షాహీన్‌ చేసిన ప్రతిపాదనకు మెజారిటీ సెనెటర్లు గతనెల మద్దతు తెలిపిన విషయాన్ని జతులిన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్‌ పార్టీ నేత ట్రంప్‌ నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు రష్యాటుడే మీడియా సంస్థ, క్రెమ్లిన్‌ కార్యాలయాలు మద్దతు తెలిపాయని ఆరోపించారు. షాహీన్‌ ఆరోపణలను పుతిన్‌ సర్కార్‌, రష్యాటుడే ఖండించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/