Begin typing your search above and press return to search.

శ‌భాష్ మోడీ..రికార్డు స్థాయిలో ప‌డిన రూపాయి

By:  Tupaki Desk   |   14 Aug 2018 7:27 AM GMT
శ‌భాష్ మోడీ..రికార్డు స్థాయిలో ప‌డిన రూపాయి
X
రూపాయి ప‌డిపోయింది. దారుణంగా ప‌త‌న‌మైంది. ఎంత‌లా అంటే.. రికార్డు స్థాయిలో రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఒక డాల‌ర్ కు రూ.70కు విలువ దిగ‌జారింది. ట‌ర్కీలో ఆర్థిక మాంద్యం భ‌యాల నేప‌థ్యంలో ఆ దేశ క‌రెన్సీ ట‌ర్కిష్‌లిరా భారీగా ప‌త‌న‌మైన వేళ‌.. ఆ ప్ర‌భావం మ‌న క‌రెన్సీ మీదా ప‌డింది.

ఇప్పుడంటే ప్ర‌త్యేక ప‌రిస్థితి కాబ‌ట్టి.. ఈ పోటు ఎంతో కొంత మ‌న‌కు త‌ప్ప‌ద‌ని అనుకుందాం. గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా దేశానికి చౌకీదార్ గా ఉన్న మోడీ గారి హ‌యాంలో రూపాయి ఎందుకు బ‌ల‌ప‌డ‌లేదు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలోనూ.. వాట్సాప్ ల‌లోనూ న‌యా హిందుత్వవాదులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వారి కోరికంతా ఒక్క‌టే. మ‌రోసారి మోడీ ప్ర‌ధాని కావాలి.

మోడీ హ‌యాంలో ఏం జ‌ర‌గ‌లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే.. రాముడి పాల‌న కూడా స‌రిపోద‌న్న‌ట్లుగా మాట్లాడే వారిని వ‌దిలేసి.. వాస్త‌వంలోకి వెళితే.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో డాల‌ర్ తో పోలిస్తే.. రూపాయి ఎంత‌గా బ‌ల‌హీన ప‌డిందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. సోమ‌వారం డాల‌రుతో రూపాయి మార‌కం విలువ ఏకంగా 110 పైస‌లు ప‌డిపోయి కొత్త రికార్డు సృష్టించింది.

ఏ మాట‌కు ఆ మాట చెప్పుకోవాలి.. వాజ్ పేయ్ హ‌యాంలో డాల‌రుతో పోలిస్తే.. రూపాయి మార‌కం విలువ బ‌ల‌ప‌డింద‌ని చెప్పాలి. ఆ త‌ర్వాత కొద్ది రోజులు అదే తీరు కంటిన్యూ అయినా.. త‌ర్వాత మాత్రం ప‌త‌నంఆగ‌కుండా సాగుతూనే ఉంది. ఒక‌ప్పుడు డాల‌రుతో రూపాయి విలువ 50రూపాయిల ఉంటే వామ్మో అనుకునే ప‌రిస్థితి. అది కాస్తా.. ఇప్పుడు రూ.70 వ‌ర‌కూ దిగ‌జారిన తీరు చూస్తే.. మోడీ అచ్చేదిన్ ఇదేనా? అనుకోక త‌ప్ప‌దు.

ట‌ర్కీ సంక్షోభం నేప‌థ్యంలో డాల‌ర్ దిగుమ‌తిదార్లు.. బ్యాంక‌ర్ల నుంచి డిమాండ్ బాగా పెర‌గ‌టంతో రూపాయి బ‌ల‌హీన ప‌డిన‌ట్లుగా ట్రేడ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. తాజా మార‌కం విలువ చూస్తే.. డాల‌రుతో రూపాయి రూ.70.08 పైస‌లుగా న‌మోద‌వుతుంది. చ‌రిత్ర‌లో రూపాయి ఇంత‌గా దిగ‌జార‌టం ఇదే తొలిసారి. క్రెడిట్ గోస్ టూ...? ఎవ‌రి ఖాతాలో వేద్దాం?