Begin typing your search above and press return to search.

అల్లుడి దెబ్బ‌కు..ఈ నేతాశ్రీకి క‌ళంకం అంటిందే!

By:  Tupaki Desk   |   25 Sep 2017 11:21 AM GMT
అల్లుడి దెబ్బ‌కు..ఈ నేతాశ్రీకి క‌ళంకం అంటిందే!
X
కేఫ్ కాఫీ డే... సంప‌న్నుల పిల్ల‌లు - జేబులో క‌ట్ట‌లు పెట్టేసుకుని టైమ్ పాస్‌కు బ‌య‌లుదేరే బ‌డా బాబుల‌కు అడ్డాగా పేరొందిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. కాఫీ షాపు అంటే... అప్ప‌టిదాకా రోడ్ల‌పై క‌నిపించే సాదా సీదా టీ స్టాళ్లే. అయితే 1990 ద‌శ‌కంలో ఓ బ‌డా రాజ‌కీయ వేత్త ఈ కాఫీ అమ్మే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని బ్రిగేడ్ రోడ్డులో తొలుత ఆ యువ‌కుడు ప్రారంభించిన ఈ కాఫీ షాప్ దేశంలోనే హాట్ టాపిక్‌ గా మారిందనే చెప్పాలి. క‌ర్ణాట‌క‌కే చెందిన స‌ద‌రు సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త అల్లుడు ప్రారంభించిన ఆ కాఫీ షాప్‌... 27 ఏళ్లు తిర‌క్కుండానే... దేశ‌వ్యాప్తంగా విస్త‌రించింది. సింగిల్ బంకుగా స్టార్టైన ఆ కాఫీ షాప్ ఇప్పుడు ఏకంగా 1500 షాపులుగా మారిపోయింది. ఖ‌రీదైన‌ - అరుదైన కాఫీల‌కు - ఉబుసుపోని క‌బుర్ల‌కు - టైంపాస్ కుర్రాళ్ల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా నిలిచిన ఈ షాప్ పేరే... కేఫ్ కాఫీ డే. దీని య‌జ‌మాని ఎవ‌రంటే... మొన్న‌టిదాకా కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌గా వెలుగొంది... ఇటీవ‌లే క‌మ‌లం కండువా క‌ప్పుకున్న క‌ర్ణాట‌క మాజీ సీఎం - కేంద్ర మాజీ మంత్రిగానే కాకుండా గ‌వ‌ర్న‌ర్‌ గానూ ప‌ద‌వి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఎస్ ఎం కృష్ణ అల్లుడు జీవీ సిద్ధార్థ్‌.

అయినా ఇప్పుడు ఈ సిద్ధార్థ్ - ఆయ‌న ప్రారంభించిన కేఫ్ కాఫీ డే సంగ‌తి ఎందుకంటారా? వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ - ఇత‌ర ఆర్థిక నేర ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారులు నిర్వ‌హించిన‌ ముమ్మ‌ర సోదాల్లో ఈ కాఫీ షాపుల్లో రూ.650 కోట్ల మేర అక్ర‌మాస్తులు వెలుగు చూశాయి మ‌రి. అందుకే ఈ క‌థ చెప్పుకోవాల్సిందే. గ‌త‌వారం ఒకానొక రోజున ఉద‌యం లేవ‌గానే సిద్ధార్థ్ ఇంటి ముందు ఐటీ - ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారులు ఒకేసారి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ట‌. దీంతో కంగు తిన్న సిద్ధార్థ్‌... ఎందుకొచ్చార‌ని వారిని ప్ర‌శ్నించ‌డానికి కూడా సాహ‌సం చేయ‌లేద‌ట‌. ఎందుకంటే... దాదాపు మూడు ద‌శాబ్దాలుగా తాను నిర్వ‌హిస్తున్న వ్యాపారంలోని అస‌లు లొసుగులు ఆయ‌న‌కు ఎరుకే క‌దా. స‌ద‌రు లొసుగులు తెలుసుకున్న మీద‌టే... ఆయ‌న ద‌ర్యాప్తు అధికారులను అడ్డుకునే సాహ‌సం చేయ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. నాలుగు రోజుల పాటు ఏక‌బిగిన కొన‌సాగిన సోదాల్లో అధికారులు సిద్ధార్థ్ వద్ద ఏకంగా రూ.650 కోట్ల మేర నోట్ల క‌ట్ట‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ త‌ర్వాత విచార‌ణ‌లో భాగంగా సిద్ధార్థ్... ఆ సొమ్మంతా కూడా తాను అక్ర‌మంగా కూడ‌బెట్టిన‌దేన‌ని ఒప్పేసుకున్నార‌ట‌. వ‌చ్చిన లాభాల‌పై ప్ర‌భుత్వానికి క‌ట్టాల్సిన ప‌న్న‌ను ఎగ‌వేసిన క్ర‌మంలోనే ఆయ‌న ఈ మొత్తం అక్ర‌మ సంపాద‌న‌ను పోగేసుకున్నార‌ని కూడా వెల్ల‌డైన‌ట్లు స‌మాచారం. ఇంకేముంది సిద్ధార్థ్‌పై ఆర్థిక నేరాల‌కు సంబంధించిన కేసుల‌ను న‌మోదు చేసేందుకు అధికారులు సిద్ధ‌మైపోయార‌ట‌.

ఇదిలా ఉంటే... ఎస్ ఎం కృష్ణకు రాజ‌కీయాల్లో మ‌చ్చ‌లేని నేత‌గానే పేరుంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగిన ఆయ‌న క‌ర్ణాట‌కకు తొలుత డిప్యూటీ సీఎంగా, ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రిగానూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ త‌ర్వాత యూపీఏ హ‌యాంలో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ గానూ కొన‌సాగారు. గ‌వ‌ర్న‌ర్ గిరీ వెల‌గ‌బెట్టిన నేత‌ల‌కు దాదాపుగా రాజ‌కీయాలపై మ‌రింత ఆశ ఉండ‌ద‌నే చెప్పాలి. అయితే ఎస్ ఎం కృష్ణ ఆ కోవ‌లోని వ్య‌క్తిగా నిలిచేందుకు సిద్ధంగా లేరు. అందుకే.. గ‌వ‌ర్న‌ర్ ప‌దవికి రాజీనామా చేసి మ‌రీ మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అలా రీ ఎంట్రీ ఇచ్చిన కృష్ణ‌కు కాంగ్రెస్ పార్టీ రెడ్ కార్పెట్ ప‌రిచింద‌నే చెప్పాలి. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ కేబినెట్ లో ఆయ‌న‌కు కీల‌క మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. విదేశీ వ్య‌వ‌హ‌రాల మంత్రిగా ఆయ‌న కొన‌సాగారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ స‌ర్కారు ఓడిపోవ‌డంతో కృష్ణ కూడా మంత్రి ప‌ద‌వి కోల్పోయారు. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు గానీ... ఇటీవ‌లే ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో త‌న‌కు వ‌రుస అవ‌మానాలు జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన కృష్ణ ఇటీవ‌లే... బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయ‌న చేరిన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే త‌న అల్లుడిపై సోదాలు జ‌ర‌గ‌డం విశేషం. ఈ సోదాల్లో సిద్ధార్థ్ అక్ర‌మార్జ‌న బ‌య‌టకు రావ‌డంతో అప్ప‌టిదాకా క్లీన్ ఇమేజ్‌ తో కొనసాగిన కృష్ణ ప్ర‌తిష్ఠపై కూడా మ‌చ్చ ప‌డిపోయింద‌నే చెప్పాలి. సో... అల్లుడి దెబ్బ‌కు మామ‌పై చెర‌గ‌ని మ‌చ్చ ప‌డిపోయింద‌న్న మాట‌.