Begin typing your search above and press return to search.

ఆదాయ పన్ను శాఖకు సహకరిస్తే కోటి మీదే

By:  Tupaki Desk   |   2 Jun 2018 8:24 AM GMT
ఆదాయ పన్ను శాఖకు సహకరిస్తే కోటి మీదే
X
బినామీ లావాదేవీలు లేదా వారి ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించినవారికి భారీ పారితోషకాన్ని ఇస్తామని ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. ‘బినామీ లావాదేవీల సమాచార రివార్డు పథకం 2018’ పేరిట ప్రకటన జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఎవరైతే నల్లధనం - బినామీ లావాదేవీలు - అక్రమ ఆస్తులకు సంబంధించి సమాచారాన్ని అందిస్తారో వారికి రూ. 1 కోటి వరకు రివార్డు దక్కుతుంది. ఇక లెక్కల్లోలేని విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని వెలికితీస్తే రూ. 5 కోట్ల వరకు దక్కించుకోవచ్చు. 1961 ఆదాయ పన్ను చట్టం కింద దేశంలో ఆస్తులు - ఆదాయం - పన్ను ఎగవేతదారులకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తికి రూ.50 లక్షల వరకు రివార్డు అందిస్తారు.

బినామీ లావాదేవీలు - అక్రమ ఆస్తులు - ఆదాయం - పన్నుఎగవేతలను అరికట్టడంలో ప్రజలను కూడా భాగస్వాములుగా చేయడమే ఉద్దేశంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకవచ్చినట్టు సెంటర్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) పేర్కొంది. అయితే బినామీ లావీదావీలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎట్టిపరిస్థితుల్లో వారి వివరాలను బహిర్గతం చేయబోమని ఆదాయ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ విచారించిన నల్లధనం కేసుల్లో చాలావరకూ ఒకరి ఆస్తులను మరొకరి పేరుతో పెట్టుబడినట్టు గుర్తించామని, దీనివల్ల బినామీదారుడికి కంటే అసలు యజమాని పన్ను రాబడితో ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నట్టు ఆదాయ శాఖ పేర్కొంది.

చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు 1988 బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం - 2016 బినామీ లావాదేవీల నిషేధిత సవరణ చట్టాలను ఇటీవలే ప్రభుత్వం సవరించింది. కాగా, సమాచారం ఇచ్చే వ్యక్తి.. అక్రమార్కులకు సంబంధించిన సమాచారం ఇచ్చే సమయంలో కొన్ని పత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలు అన్ని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.