రోజాతో ఫేస్ టుఫేస్..అఖిలప్రియకు దిమ్మతిరిగిందట

Tue Aug 08 2017 15:37:41 GMT+0530 (IST)

పేరుకు ఉప ఎన్నికే అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచేసిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ తప్పులను ఎండగట్టడం అవకాశం దొరికితే చాలు ఆ పార్టీని ఆడేసుకోవడంలో ముందుండే వైసీపీ ఎమ్మెల్యే - ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా - నంద్యాల గెలుపు ఓటముల ఆధారంగా రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉన్న రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ మధ్య ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో హాట్ హాట్ చర్చ సాగింది. సహజంగానే ఈ చర్చలో రోజాది పైచేయి అయినప్పటికీ మంత్రి అఖిలప్రియ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక అభ్యర్థి శిల్పా బ్రదర్స్ తప్ప వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అంటే తమకు గౌరవం ఉందని ఆమె తెలిపారు. శిల్పా బ్రదర్స్ కారణంగా భూమా కుటుంబ సభ్యులు అనేక ఇక్కట్ల పాలయ్యారని పేర్కొన్నారు. అందుకే తాము ఉప ఎన్నికల టికెట్ ఇవ్వడం మొదలుకొని ఎన్నికల బరిలో నిలిచే వరకు శిల్పాను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. శిల్పా మోహన్ రెడ్డికి క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఇటీవల ఆయన మహిళలను తీవ్రంగా అవమానించారని అందుకే పలువురు మహిళలు శిల్పా నివాసం వద్ద ఆందోళన చేశారని గుర్తుచేశారు.

మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా తిప్పికొట్టారు. మహిళలను అవమానించిన నాయకులకు కేరాఫ్ అడ్రస్ గా తెలుగుదేశం పార్టీ మారిందని రోజా మండిపడ్డారు. సినిమా ఫంక్షన్ లో సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ మహిళలను అవమానించారని - అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బోండా ఉమా తనపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. తాను సినిమాల్లో చేసిన పాత్రల గురించి ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న విమర్శలు చేశారని గుర్తు చేసిన రోజా....ఇవన్నీ మహిళలను గౌరవించే సంఘటలనకు చిహ్నాలు అవుతాయా అంటూ మంత్రి అఖిలప్రియను నిలదీశారు. దీంతో అవాక్కవడం మంత్రి వంతు అయిందని అంటున్నారు. మరోవైపు చర్చమొత్తంలో రోజా పై చేయి సాధించడం స్పష్టంగా కనిపించిందని పలువురు అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం వైసీపీ ఉద్దేశాలను స్పష్టంగా వివరించడంలో రోజా సఫలం అయ్యారని చెప్తున్నారు.